చరణ్-ప్రశాంత్ నీల్ ఫిక్స్?

ram charan
Ram Charan, Prasanth Neel and Chiranjeevi


‘బాహుబలి’తో ప్రభాస్ రేంజ్ ఒకేసారి ఎంత పెరిగిందో తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ చిత్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్థాయి కూడా పెరగడం ఖాయం. మారే ఇమేజ్‌కు తగ్గట్లు సరైన ప్రాజెక్టులు ఎంచుకుని ముందుకు సాగడం అవసరం. ఈ విషయంలో తారక్, చరణ్ తెలివిగానే అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.

కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో తారక్ సినిమాలు ఖరారు చేసుకోగా.. చరణ్ మూడు చిత్రాలను ఓకే చేశాడు. అందులో ఒకటైన శంకర్ సినిమా ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్లిపోయింది. దాని తర్వాత చరణ్ చేయనున్న రెండు చిత్రాలు దసరా సందర్భంగా ఖరారయ్యాయి. చాన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతున్నట్లే ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. యువి క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి.

ఇది ఉదయం ముచ్చట కాగా.. సాయంత్రానికి చరణ్ తర్వాతి సినిమా కబురు కూడా బయటికొచ్చేసింది. తన 17వ సినిమాను చరణ్ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతుండటం విశేషం. దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఈ దిశగా హింట్స్ అయితే వచ్చాయి. చిరంజీవి, చరణ్‌లను కలిసిన ఫొటోను ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చిరంజీవిని కలవాలన్న తన చిన్ననాటి కోరిక తీరిందని.. చిరంజీవి లెజెండ్ అయితే.. చరణ్ లెజెండ్ ఇన్ మేకింగ్ అని ప్రశాంత్ వ్యాఖ్యానించాడు.

చిరుతో కానీ, చరణ్‌తో కానీ తాను సినిమా చేయబోతున్నట్లు ప్రశాంత్ ప్రకటించలేదు కానీ.. చరణ్ హీరోగా ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మించిన డీవీవీ దానయ్య ప్రొడక్షన్లో ప్రశాంత్ సినిమా చేయబోతున్నాడన్నది మెగా క్యాంపు వర్గాల మాట. త్వరలోనే దీని గురించి ప్రకటన వస్తుందట. ప్రస్తుతం ‘సలార్’ చేస్తున్న ప్రశాంత్.. దాని తర్వాత తారక్ సినిమాను డైరెక్ట్ చేస్తాడు. ఈలోపు చరణ్.. శంకర్, గౌతమ్ చిత్రాలను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వీరి కలయికలో సినిమా వస్తుంది. బహుశా ఈ చిత్రం 2023లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.