మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల విషయంలో సస్పెన్స్‌కు తెరపడింది. ఎన్నికలు జరిగిన ఆదివారమే ఫలితాలు కూడా వచ్చేశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు 106 ఓట్ల ఆధిక్యంతో ప్రకాష్ రాజ్ మీద విజయం సాధించాడు. విష్ణుకు 380 ఓట్లు రాగా.. ప్రకాష్ రాజ్ 274 ఓట్లకు పరిమితం అయ్యాడు. పోలైన ఓట్లు 600 పైచిలుకే కాబట్టి విష్ణు మంచి ఆధిక్యమే సాధించినట్లు. మెగా ఫ్యామిలీ బ్యాకప్ ఉన్నప్పటికీ ప్రకాష్ రాజ్ ఇంత తేడాతో ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇండస్ట్రీపై తిరుగులేని పట్టు ఉన్నట్లుగా భావించే మెగా ఫ్యామిలీ.. ప్రకాష్ రాజ్‌ను గెలిపించుకోలేకపోవడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.
ఐతే ఎంత కాదనుకున్నా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ కావడం ఎన్నికల్లో ప్రభావం చూపిందన్నది స్పష్టం. దీనికి తోడు మెగా ఫ్యామిలీ పరోక్ష మద్దతు ఇచ్చిందే తప్ప.. ప్రకాష్ రాజ్ గెలుపు కోసం కార్యక్షేత్రంలోకి దిగి కష్టపడలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్‌కు ఉందని వాళ్లూ వీళ్లూ అనడమే తప్ప.. చిరు తాను ప్రకాష్ రాజ్‌ను బలపరుస్తున్నట్లు ప్రకటించలేదు. ముందు నుంచి మెగా ఫ్యామిలీ తరఫున వాయిస్ వినిపిస్తోంది, ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా మాట్లాడుతోంది నాగబాబే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓటమికి బాధ్యుడిగా చూస్తున్నది కూడా ఆయన్నే. ఓవైపు మంచు విష్ణు బయటి రాష్ట్రాల వారికి ఫ్లైట్ టికెట్లు వేయించి, ఎయిర్ పోర్ట్ నుంచి ట్రాన్స్‌పోర్ట్ కూడా పెట్టించి ఓటింగ్‌కు రప్పిస్తే.. నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారికలను కూడా పోలింగ్ కేంద్రానికి రప్పించలేకపోయాడని.. మెగా ఫ్యామిలీలో మరికొందరితోనూ ఓటు వేయించడంలో విఫలమయ్యాడని విమర్శలు గుప్పిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.
దీనికి తోడు దేశ సినీ చరిత్రలోనే అత్యుత్తమ నటుల్లో ఒకడు, తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ కోట శ్రీనివాసరావు గురించి ఎన్నికల ముంగిట అసహనం ఆపుకోలేక నాగబాబు తీవ్ర పదజాలం వాడటం, దూషించడం ప్రకాష్ రాజ్‌కు చేటు చేసిందన్నది స్పష్టం. దీంతో ఇప్పుడు అందరూ నాగబాబు మీద పడిపోతున్నారు. నాగబాబుకు ఆవేశం తప్ప ఆలోచన, వ్యూహం ఉండవని.. నోరు అదుపు చేసుకోలేరని.. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన తన అన్నదమ్ములకే కాదు.. ఇప్పుడు మా ఎన్నికల బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్‌కు సైతం నాగబాబు చేసిన మేలు కంటే చేటే ఎక్కువ అంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.