క్రిష్ దర్శకత్వంలో బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయగా.. ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించబోతుందని సమాచారం. అయితే అది సినిమా కాదు.. టాక్ షో అని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’.. బాలయ్య హోస్ట్ గా ఓ టాక్ షో ప్లాన్ చేస్తుంది. నిజానికి బాలయ్య ఇప్పటివరకు హోస్ట్ గా ఎప్పుడూ వ్యవహరించలేదు.

కానీ ‘ఆహా’ కోసం ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ షో ద్వారా వచ్చే డబ్బుని ఛారిటీ కోసం ఖర్చు చేయాలని బాలయ్య భావిస్తున్నారట. ఈ టాక్ షోకి ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో టాక్ షోలను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ ఇలా.. సినిమా ఫార్మాట్ లోనే సాగుతుంది. నిజానికి బాలీవుడ్ లో ఇంత హడావిడి ఉంటుంది కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు.

గతంలో ‘ఆహా’లో వచ్చి ఓ టాక్ షోకి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. బాలయ్యతో అనుబంధం ఉన్న దర్శకుడైతే షోని సక్సెస్ ఫుల్ గా నిర్వహించగలరని ‘ఆహా’ భావించింది. అందుకే ఆ బాధ్యతను క్రిష్ కి అప్పగించింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ రూపొందించిన ‘కొండపొలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.