స్టార్ హీరో ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం!

కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు అజిత్. ఆయన సినిమాలు వందల కోట్లలో వసూళ్లు సాధిస్తుంటాయి. తెలుగునాట కూడా అజిత్ కి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘వాలిమై’ షూటింగ్ ను ఇటీవల హైదరాబాద్ లోనే చిత్రీకరించారు. అజిత్ వివాదాల జోలికి వెళ్లరు. తన ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి హీరో కారణంగా తను ఇబ్బంది పడ్డానని ఓ మహిళ ఏకంగా అజిత్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అజిత్ ని కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదని.. తన చావుకి కారణం అజితే అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ వేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి చేరుకొని సదరు మహిళ ఒంటిపై నీళ్లుపోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఫర్జానా అనే మహిళ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుండేది. గతేడాది కరోనా సమయంలో అజిత్, షాలిని కలిసి అదే హాస్పిటల్ కు వెళ్లారు. దీంతో ఫర్జానా అజిత్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. అజిత్ కరోనా బారిన పడ్డాడంటూ వార్తలు కూడా వచ్చాయి.

అయితే హాస్పిటల్ రూల్స్ కి వ్యతిరేకంగా ఫర్జానా ప్రవర్తించిందని.. ఆమెని ఉద్యోగంలో నుంచి తీసేశారు. అయితే అజిత్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే తన ఉద్యోగం తిరిగి వస్తుందనే ఆశతో ఆమె పలుమార్లు అజిత్ ను కలవడానికి ప్రయత్నించింది. కానీ అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ అజిత్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని.. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని సమాచారం.