ప్రభాస్ 25వ సినిమా అప్డేట్ ఇదే!

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ఇప్పుడు తన 25వ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న ప్రభాస్.. తన 21వ సినిమాగా ‘ఆదిపురుష్’ని మొదలుపెట్టారు. 22వ సినిమాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్నారు. 23వ సినిమా ‘ప్రాజెక్ట్ K’ కాగా.. 24వ సినిమా సిద్ధార్థ్ ఆనంద్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ 25వ సినిమా గురించి ప్రకటన రానుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది.

అక్టోబర్ 7న ఈ ప్రకటన రానుందని సమాచారం. ఇంతకీ ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే.. సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాను అందించిన ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. నిజానికి గతంలో ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు. బాలీవుడ్ సంస్థ టి సిరీస్ ఈ సినిమాను నిర్మించబోతోంది.

ఈ సంస్థతో పాటు మరో సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోనుంది. మైత్రి మూవీ మేకర్స్ లేదా యూవీ క్రియేషన్స్ లో ఏదొక బ్యానర్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుందని అంటున్నారు. దిల్ రాజుకి కూడా ప్రభాస్ ఓ సినిమా చేయాలి. మరి ఆయన ఏ బ్యానర్ ను ఇన్వాల్వ్ చేస్తారో చూడాలి. వరుస సినిమాలు ప్రకటిస్తూ.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తూ చాలా బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాను జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.