నందమూరి బాలకృష్ణ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు తనపై పుత్ర వాత్సల్యం ఉందన్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావు అంటే కేసీఆర్‌కు ఎంతో అభిమానమని.. ఆ అభిమానంతోనే తనను కొడుకుతో సమానంగా చూస్తారని అన్నాడు బాలయ్య. ఇటీవల షూటింగ్‌ల పునఃప్రారంభంపై ప్రభుత్వంతో నిర్వహించిన సమావేశాలకు తనను పిలవకపోవడంపై బాలయ్య కినుక వహించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో దుమారం రేగింది. ఐతే తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన బాలయ్యను తెలంగాణ ముఖ్యమంత్రితో, మంత్రితో సమావేశాలకు పిలవడం ఇబ్బందన్న ఉద్దేశంతో ఆయన్ని ఆహ్వానించకపోయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య వద్ద ప్రస్తావిస్తూ, మీరు తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టే పిలవలేదేమో అని చెప్పగా.. బాలయ్య ఆసక్తికర రీతిలో స్పందించాడు. సీఎం కేసీఆర్‌ను కలవడానికి వాళ్లంతా వెళ్లినప్పుడు నన్నెందుకు పిలవలేదో నాకు తెలియదు. ఒకవేళ గతంలో నేను రాజకీయ కోణంలో ఆయనపై చేసిన విమర్శల కారణంగా నన్ను పిలవకపోతే ఆ విషయం నాకు చెప్పాల్సింది. కేసీఆర్‌గారికి నా మీద ఎప్పుడూ కోపం లేదు. రాజకీయం వేరు.. ఇది వేరు. రామారావుగారి అభిమానిగా నేనంటే కేసీఆర్ గారికి పుత్ర వాత్సల్యం ఉంది. మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు’’ అని బాలయ్య అన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయాలపై బాలయ్య స్పందిస్తూ.. రాజకీయాల్లో రావడం అనేది అతని ఇష్టమని, వృత్తిని వదులుకుని రమ్మని చెప్పలేమని అన్నాడు బాలయ్య. ఇప్పుడు తాను, ఒకప్పుడు తన తండ్రి ఒకేసారి సినిమాలు, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నామని.. రాజకీయాల్లో రావడం అనేది వాళ్ల సొంత నిర్ణయమని చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates