మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడింది. ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఓవైపు ప్రకాష్ రాజ్.. ఇంకోవైపు మంచు విష్ణు ప్యానెళ్లు అస్త్ర శస్త్రాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పోటీలో వేరే వాళ్లు కూడా ఉన్నప్పటికీ వాళ్లు నామమాత్రమే. ప్రధానంగా వీరి ప్యానెళ్ల మధ్యే పోటీ జరగబోతోంది. ఇండిపెండెంట్గా జనరల్ సెక్రటరీ పదవికి పోటీలో నిలిచిన బండ్ల గణేష్ సైతం నామినేషన్ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
దీంతో పోటీ రెండు ప్యానెళ్ల మధ్యే కేంద్రీకృతం కానుంది. మరి ‘మా’ సభ్యులు ఈ ప్యానెళ్లలో ఎవరి వైపు నిలుస్తారన్నది ఆసక్తికరం. ఈసారి ‘మా’ ఎన్నికలు రాజకీయ రంగు కూడా పులుముకోవడం.. దాని ప్రాతిపదికనే ఓట్లు కూడా పడే సూచనలు కనిపిస్తుండటం గమనార్హం. ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారింది.
ఇటీవల ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్.. వైకాపా సర్కారును టార్గెట్ చేయడం తెలిసిందే. పవన్ను టార్గెట్ చేయబోయి ఇండస్ట్రీని ఇబ్బందుల్లో పెట్టారంటూ ఏపీలో వైకాపా సర్కారు మీద ఇండస్ట్రీలో మెజారిటీ జనాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కానీ పైకి తమ అసంతృప్తిని వెళ్లగక్కే సాహసం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో జగన్ కుటుంబానికి సన్నిహితుడైన మంచు విష్ణు ఎన్నికల బరిలో నిలిచాడు. ఆయన ప్యానెల్లోనూ కొందరు వైకాపా మద్దతుదారులున్నారు. పైగా వైసీపీ ప్రభుత్వం మీద పవన్ చేసిన వ్యాఖ్యలను మంచు విష్ణు ఖండించడం గమనార్హం. దీనికి బదులుగా ప్రకాష్ రాజ్.. మంచు విష్ణును తప్పుబట్టాడు.
ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలు జనసేన వెర్సస్ వైకాపా తరహాలో తయారైన పరిస్థితి తలెత్తింది. పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీకి మద్దతుగా నిలిచేవాళ్లంతా ప్రకాష్ రాజ్ వైపు నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. మిగతా వాళ్లు మంచు విష్ణు వైపు నిలవనున్నారు. కాబట్టి ‘మా’ ఎన్నికల్లో జనసేన వెర్సస్ వైకాపా వార్ క్లియర్ అన్నమాటే.