ద‌ర్శ‌కేంద్రుడి రిస్క్.. ఏమ‌వుతుందో ఏమో?


ఒక‌ప్పుడు టాలీవుడ్లో ద‌ర్శ‌కేంద్రుడి హవా ఎలా సాగిందో తెలిసిందే. తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది మ‌న సినిమాల రీచ్‌, మార్కెట్‌ను అమాంతం పెంచేసిన ద‌ర్శ‌కుడాయ‌న‌. ఆయ‌న ఏం చేస్తే అది అప్ప‌ట్లో ట్రెండ్ అయింది. కానీ ఎలాంటి ట్రెండ్ సెట్ట‌ర్ అయినా.. ఏదో ఒక ద‌శ‌లో ఔట్ డేటెడ్ కావాల్సిందే. ద‌ర్శ‌కేంద్రుడు కూడా అందుకు మిన‌హాయింపు కాలేక‌పోయారు. ఆయ‌న గ‌త రెండు ద‌శాబ్దాల్లో తీసిన సినిమాల్లో ఒక్క శ్రీరామ‌దాసు మిన‌హా ఏదీ ఆక‌ట్టుకోలేదు. చివ‌ర‌గా త‌న స్ట‌యిల్లో తీసిన భ‌క్తి చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ కూడా చేదు అనుభ‌వాన్నే ఎదుర్కొంది.

ఇక రాఘ‌వేంద్ర‌రావు తీసిన మామూలు సినిమాలు ఝుమ్మంది నాదం, అల్ల‌రి బుల్లోడు, సుభాష్ చంద్ర‌బోస్ లాంటి సినిమాల గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. మారుతున్న ప్రేక్ష‌కుల అభిరుచిని రాఘ‌వేంద్ర‌రావు అర్థం చేసుకోలేక‌పోయార‌న‌డానికి ఈ సినిమాలు నిద‌ర్శ‌నంగా నిలిచాయి.

దీంతో నెమ్మ‌దిగా సినిమాలు తగ్గించేసి, ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూర‌మైపోయిన‌ట్లు క‌నిపించిన రాఘ‌వేంద్ర‌రావు.. చాలా కాలం త‌ర్వాత త‌న స్వీయ నిర్మాణంలో, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెళ్ళిసంద‌-డి అనే సినిమాను రూపొందించారు. గౌరి రోనంకి అనే కొత్త ద‌ర్శ‌కురాలు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించింది. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్, ఇంకా పాట‌లు.. ఏవి చూసినా.. 90ల్లో రాఘ‌వేంద్ర‌రావు తీసిన‌ రొమాంటిక్ సినిమాల‌ను త‌ల‌పించాయి. పెళ్ళిసంద‌-డి అని పేరు పెట్టి అప్ప‌టి సినిమానే తీశారా అన్న కామెంట్లు ప‌డ్డాయి ఈ సినిమా ప్రోమోలు చూసి.

ఈ టైంలో ఇలాంటి సినిమా తీయ‌డ‌మే రిస్క్ అంటే.. గ‌ట్టి పోటీ ఉన్న ద‌స‌రా సీజ‌న్లో ఈ చిత్రాన్ని నిల‌బెట్టాడు రాఘ‌వేంద్ర‌రావు. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. అక్టోబ‌రు 15న పెళ్ళిసంద‌-డి విడుద‌ల కానుంది. అదే రోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్, వ‌రుడు కావలెను.. ముందు రోజు మ‌హాస‌ముద్రం మంచి అంచ‌నాల రిలీజ‌వుతున్నాయి. వీటి పోటీని త‌ట్టుకుని ఈ మోడ‌ర్న్ పెళ్ళిసంద‌-డి ఏమాత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తుందో ఏమో మ‌రి.