‘ఆరెంజ్’ ఛాయలు కనిపిస్తున్నాయ్ కానీ..


‘బొమ్మరిల్లు’ సినిమాతో తనపై అంచనాల్ని భారీగా పెంచేశాడు యువ దర్శకుడు భాస్కర్. అతడి రెండో సినిమా ‘పరుగు’ ఆ స్థాయిలో లేకపోయినా అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. దీంతో ‘మగధీర’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన రామ్ చరణ్‌తో ‘ఆరెంజ్’ లాంటి భారీ చిత్రాన్ని తీసే అవకాశం దక్కించుకున్నాడతను.

‘మగధీర’ తర్వాత ఇమేజ్ భారం మోయకుండా కొంచెం భిన్నంగా ఉంటుందని ఈ ప్రేమకథను ఒప్పుకున్నాడు చరణ్. కానీ ఈ సినిమాపై అందరి అంచనాలూ తల్లకిందులయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ దెబ్బతో భాస్కర్ జీవితం తల్లికందులైపోయింది. గత పుష్కర కాలంలో అతడికి ఏదీ కలిసి రాలేదు. ఒక దశలో ఇండస్ట్రీ నుంచి అడ్రస్ లేకుండా పోయాడతను. ఇంత కాలానికి మళ్లీ కోలుకుని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణంలో అఖిల్ అక్కినేని హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తీశాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. అది కూడా ఆకట్టుకునేలానే ఉంది కానీ.. దీని కాన్సెప్ట్, ట్రైలర్లో చూపించిన అంశాలు ఆటోమేటిగ్గా ‘ఆరెంజ్’ సినిమాను గుర్తుకు తెచ్చాయి. ప్రేమ, పెళ్లి లాంటి అంశాల మీద మరోసారి భాస్కర్ ఒక ‘చర్చ’ పెట్టినట్లే కనిపిస్తున్నాడు. ఈ చర్చ కొంచెం లోతుగానే అనిపిస్తోంది.

‘ఆరెంజ్’లో ఆ లోతు మరీ ఎక్కువైపోవడం వల్ల ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయి, ప్రేక్షకులు డ్రైగా ఫీలయి సినిమాను తిరస్కరించారు. నిజానికి ‘ఆరెంజ్’ మంచి సినిమానే. అందులో మంచి అంశాలే చర్చించారు. కానీ అది అనుకున్నంత ఎంటర్టైనింగ్‌గా లేకపోయింది. ఆ సమయానికి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ తర్వాత టీవీల్లో ఈ సినిమా చూసి చాలామంది మెచ్చుకున్నారు. దానికి ‘కల్ట్’ స్టేటస్ కూడా వచ్చింది. కానీ ఇలాంటి చిత్రాలు థియేటర్లలో చూడ్డానికి అంత బాగుండవు.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ట్రైలర్ చూస్తే భాస్కర్ మళ్లీ ‘ఆరెంజ్’ ఫ్లేవర్లోనే సినిమా తీసినట్లు కనిపిస్తోంది. ఐతే ఈసారి అతడి వెనుక అల్లు అరవింద్, బన్నీ వాసు ఉన్నారు. పైగా ఒకసారి జరిగిన తప్పును భాస్కర్ రిపీట్ చేయకపోవచ్చు. డీప్ డిస్కషన్లలోకి వెళ్లకుండా, ఎంటర్టైన్మెంట్ డోస్ తగ్గకుండా చూసుకుంటే ఈసారి అతను బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే అందుకునే అవకాశముంది. చూద్దాం మరి అక్టోబరు 15న తెరపై అతేనేం చూపిస్తాడో?