తమిళంలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో అంటే విజయే. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కూడా వెనక్కి నెట్టి తిరుగులేని స్థాయికి చేరుకున్నాడతను. ఐతే విజయ్ ఏమీ బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకోలేదు. అతడి తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ తమిళంలో పేరున్న దర్శకుడు. ఆయన బ్యాకప్‌తోనే విజయ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. స్వీయ దర్శకత్వంలో కొడుకును హీరోగా పరిచయం చేయడమే కాదు.. అతడి ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాటు అందించాడు చంద్రశేఖర్. కానీ ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులకే పడటం లేదు.
తండ్రి నుంచి చాలా ఏళ్ల కిందటే వేరుపడ్డ విజయ్.. ఇటీవల తండ్రికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లే పరిస్థితి రావడం గమనార్హం. విజయ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని కొన్నేళ్ల నుంచి చంద్రశేఖర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అతడికి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్లే ఉంది కానీ.. అందుకు ఇంకా సమయం రాలేదని భావిస్తున్నాడు.
ఐతే ఈలోపే చంద్రశేఖర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఒక పార్టీ పెట్టేసి.. అందులోకి అభిమానులను చేర్చుకుని కార్యకలాపాలు మొదలుపెట్టేశారు. ఇది విజయ్‌కు రుచించలేదు. తాను వారించినా వినకుండా ఈ పార్టీ ద్వారా వ్యవహారాలు నడపడంతో తనకు ఈ పార్టీకి సంబంధం లేదని గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు విజయ్. తర్వాత కూడా తండ్రి అత్యుత్సాహాన్ని కొనసాగించడంతో విజయ్ కోర్టును కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ తగ్గారు. విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కొడుకుతో తనకు అభిప్రాయ భేదాలున్నట్లు అంగీకరించారు. ఐతే విజయ్‌కి, అతడి తల్లికి కూడా పడట్లేదన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇటీవల చంద్రశేఖర్, ఆయన సతీమణి విజయ్ ఇంటికి వస్తే.. లోనికి రానివ్వకుండా డోర్ దగ్గరే వెయిట్ చేయించినట్లుగా మీడియాలో వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. అలాంటిదేమీ జరగలేదని.. విజయ్ తన తల్లితో చాలా సన్నిహితంగా ఉంటాడని, వాళ్లిద్దరూ తరచుగా మాట్లాడుకుంటారని.. తనతో మాత్రం అతడికి విభేదాలున్నాయని ఆయన స్పష్టతనిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates