తెలంగాణ థియేటర్లలో ఫ్లెక్సీ ప్రైసింగ్?

కరోనా మహమ్మారి ధాటికి మునుపెన్నడూ చూడని సంక్షోభంలో చిక్కుకున్నాయి థియేటర్లు. గత ఏడాదిన్నర కాలంలో థియేటర్ల నుంచి వచ్చిన ఆదాయం.. వాటి మెయింటైనెన్స్‌కు కూడా సరిపోలేదు. వాటి మీద ఆధారపడ్డ వారి జీవితాలు తల్లకిందులు అయ్యాయి. కరోనా రెండు వేవ్‌ల ధాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు మూతపడ్డాయి.

ఇక ఏపీలో అయితే థియేటర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేసే క్రమంలో చాలా ఏళ్ల కిందటి టికెట్ల రేట్లను అమలు చేయాలంటూ ప్రభుత్వం కొరడా ఝులిపించడంతో అక్కడ రెవెన్యూ బాగా పడిపోయింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. ఏపీ ప్రభుత్వంతో జాగ్రత్తగా సంప్రదింపులు జరుపుతూ చిన్న సెంటర్లలో మినిమం రూ.100 రేటు ఉండేలా ప్రభుత్వం నుంచి జీవో తీసుకు రావాలని సినీ పెద్దలు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో ఫ్లెక్సీ ప్రైసింగ్ పద్ధతిని తీసుకురావడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు టాలీవుడ్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలొస్తుండటం గమనార్హం. ఫ్లెక్సీ ప్రైసింగ్ అంటే.. డిమాండ్ ఆధారంగా టికెట్ల రేట్లను నిర్మాతలే నిర్ణయించుకునే సౌలభ్యం కల్పించడం. ఒక గరిష్ఠ రేటును నిర్దేశించి.. దానికి మించకుండా ఏ సినిమాకు ఆ సినిమాకు నిర్మాతలే రేటు ఫిక్స్ చేసుకుంటారన్నమాట. తెలుగులో ఈ గరిష్ఠ రేటు రూ.250గా పెట్టబోతున్నారట. భారీ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది మల్టీప్లెక్సుల వరకు ఈ గరిష్ఠ రేటునే ఫిక్స్ చేసే అవకాశముంది. సింగిల్ స్క్రీన్లలో రూ.150-200 మధ్య రేటు పెట్టొచ్చు.

ఐతే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఇంత రేటు పెడితే ప్రేక్షకులు థియేటర్లకు రారు కాబట్టి.. వాటిపై ఉన్న ఆసక్తిని బట్టి రేటు నిర్దేశించవచ్చు. ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్లను రప్పించడం కోసం ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే కూడా తక్కువ కూడా టికెట్ల ధరలు పెట్టొచ్చు. అది నిర్మాతలు.. డిస్టిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్ల మధ్య అవగాహనను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్లెక్సీ ప్రైసింగ్ పద్ధతి విదేశాల్లో ఎప్పట్నుంచో అందుబాటులో ఉంది. దీన్ని తెలంగాణలో కూడా ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వంతో తెలుగు సినీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని.. ప్రభుత్వం దీనిపై సానుకూలంగానే ఉందని.. త్వరలో దీనిపై ఒక నిర్ణయం వెలువడవచ్చని సమాచారం.