‘పుష్ప’రాజ్ ప్రేయసి భలే ఉందే!

ఒక్క ముద్దు పెట్టాడని విజయ్ దేవరకొండని ముప్పుతిప్పలు పెట్టిన గడసరి అమ్మాయేనా ఈమె! హి ఈజ్ సో క్యూట్ అంటూ మహేష్‌ బాబు వెనకాల పడిన అల్లరి పిల్లేనా ఈమె! అచ్చమైన పల్లెటూరి యువతిలా ఉంది. ఎవరి కోసమో అందంగా ముస్తాబవుతోంది.

‘పుష్ప’ మూవీ నుంచి రష్మిక మందాన్న ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. పట్టు రవిక వేసుకుని, చెవులకు దిద్దులు పెడుతూ కనిపిస్తోంది రష్మిక. ఎదురుగా పట్టుచీర, మల్లెపూలు ఉన్నాయి. ఈ పల్లె పడుచు గెటప్‌లో చాలా అందంగా ఉందామె. ఇంతవరకు మోడర్న్‌ గాళ్‌గా మాత్రమే కనిపించిన తనకి, ఈ సినిమాలో చేస్తున్న శ్రీవల్లి పాత్ర కచ్చితంగా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ అనే చెప్పాలి.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ ప్యాన్ ఇండియా రేంజ్‌లో టూ పార్ట్స్గా రూపొందుతోంది. మొదటి పార్ట్ని ఈ యేడు క్రిస్మస్‌కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. కరోనా వల్ల జరిగిన ఆలస్యానికి తోడు ఇప్పుడు వర్షాలు కూడా అడ్డుపడుతూ ఉండటంతో అంతకంతకు వర్క్ ఆలస్యమవుతోంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా తీయాల్సి ఉండటంతో డిసెంబర్‌‌కి పుష్ప రావడం కష్టమే అంటున్నారంతా. ఆ గుసగుసలకి చెక్‌ పెట్టడానికా అన్నట్టు రష్మిక ఫస్ట్ లుక్‌ను వదిలారు మేకర్స్. త్వరలో ఓ సాంగ్‌ని కూడా రిలీజ్ చేస్తామన్నారు. క్రిస్మస్‌కి వచ్చేస్తాం అని మరోసారి కన్‌ఫర్మ్ చేశారు.

ఇప్పటికే అల్లు అర్జున్, విలన్ ఫహాద్ ఫాజిల్‌ల లుక్స్‌ రిలీజ్ చేసి ఇంప్రెస్ చేసిన సుకుమార్.. ఇప్పుడు రష్మిక లుక్‌తోనూ మెస్మరైజ్ చేశాడు. గ్లామరస్ హీరోయిన్స్ని డీగ్లామరస్‌గా మార్చి కూడా మెప్పించడం తనకే చెల్లింది. ఆల్రెడీ రంగస్థలంలో సమంతని పల్లెటూరి పిల్లగా చూపించాడు. ఆ సినిమాకి తను హైలైట్‌గా నిలిచింది కూడా. ఇప్పుడు రష్మిక ని అలాగే తయారు చేశాడు. మరి పుష్పరాజ్ సోల్‌మేట్ శ్రీవల్లి ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాల్సిందే!