మంత్రిని సన్నాసి అనొచ్చా పవన్?

‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో పవన్ చేసిన రాజకీయ ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ స్పీచ్‌లో పవన్ మాటల తూటాలు మామూలుగా పేలలేదు. ఐతే ప్రసంగం మొత్తంలో వైసీపీ మంత్రి పేర్ని నాని గురించి పవన్ చేసిన వ్యాఖ్యలే బాగా హైలైట్ అయ్యాయి. సోషల్ మీడియా అంతటా దాని గురించే చర్చ.

నాని గురించి మాట్లాడబోతూ.. ఆయన పేరేంటో గుర్తు రావట్లేదు అని సభలో ఉన్న వారితోనే ఆయన పేరు చెప్పించాడు పవన్. కిందున్న వాళ్లు ‘పేర్ని నాని’ అని పేరు చెప్పగానే.. “అవును ఆ సన్నాసే.. ఆ సన్నాసే” అంటూ పవన్ చేసిన కామెంట్‌తో ఆడిటోరియం హోరెత్తిపోయింది. బయట ఈ ప్రసంగం చూస్తున్న వాళ్లు కూడా పవన్ చేసిన ఈ కామెంట్‌తో షాకైపోయారు.

ఐతే ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ‘సన్నాసి’ అని సంబోధించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న తలెత్తుతోందిప్పుడు. వైకాపా మద్దతుదారులు ఇదే విషయాన్ని లేవదీస్తున్నారు. పవన్ మీద ఎదురు దాడి చేస్తున్నారు. పవన్‌కు సంస్కారం లేదని.. మంత్రి గురించి చీప్‌ కామెంట్స్ చేశాడని విమర్శలు చేస్తున్నారు. ఐతే రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లాగే ఉండాలంటూ ఒక సామెతను చెబుతుంటారు. ఇప్పుడు పవన్ మద్దతుదారులు ఇదే మాట అంటున్నారు. వైసీపీ వాళ్లకు వైసీపీ భాషలోనే పవన్ సమాధానం చెప్పాడని.. ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.

మంత్రి హోదాలో ఉంటూ కొడాలి నాని వివిధ సందర్భాల్లో చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఒక పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వం తరఫున పెట్టిన ప్రెస్ మీట్లలో వాడిన బూతులు.. మిగతా వైకాపా నాయకులు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తూ.. వాళ్లకు లేని సంస్కారం పవన్‌కు ఎందుకు? ఎన్నాళ్లు గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తూ కూర్చోవాలి? అని అడుగుతున్నారు.

వైకాపా వాళ్లను ఇలా ఎదుర్కొంటే తప్ప తమ క్యాడర్లో జోష్ రాదని.. జనాల్లోనూ చురుకు పుట్టదని.. కాబట్టి పవన్ చేసింది ముమ్మాటికీ కరెక్టే.. నానిని సన్నాసి అనడంలో తప్పేమీ లేదని జనసేన మద్దతుదారులు బలంగా వాదిస్తున్నారు.