పులివెందుల నేలమాలిగలు.. పవన్ సెన్సేషన్

సినిమా వేడుకకు వస్తున్నాడు కదా.. రాజకీయాల గురించి ఏం మాట్లాడతాడులే అనుకున్నారు జనాలు పవన్ కళ్యాణ్ విషయంలో. అసలు ఏపీలో టికెట్ల ధరలు, ఇతర సమస్యల గురించైనా పవన్ స్పందిస్తాడా లేదా అని సందేహించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.

థియేటర్ల సమస్యలే కాదు.. చాలా విషయాలపై సంచలన రీతిలో స్పందించి అందరినీ పవన్ ఆశ్చర్యానికి గురి చేశాడు ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో. సమకాలీన రాజకీయాల చుట్టూ తిరిగే సినిమా ‘రిపబ్లిక్’ కావడంతో.. ఆ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వేదికగా చేసుకుని సమయోచితంగా సినీ పరిశ్రమ సమస్యలను ప్రస్తావిస్తూ.. ఏపీ అధికార పార్టీ వైసీపీ రాజకీయాలను దుయ్యబడుతూ పేలిపోయే స్పీచ్ ఇచ్చాడు పవన్. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో మీడియా అతి స్పందనను తప్పుబడుతూ వాళ్లు ఫోకస్ చేయాల్సిన విషయాలంటూ వైసీపీ మీదికి దృష్టి మళ్లించాడు.

ఈ క్రమంలో వైఎస్ కుటుంబ రాజకీయ కేంద్రమైన పులివెందుల మీద పవన్ ఫోకస్ పడింది. అక్కడ వైఎస్ కుటుంబానికి చెందిన ఇడుపుల పాయలో పెద్ద నేలమాలిగ లాంటిది ఉందని.. దాని నిండా డబ్బుల కట్టలు ఉంటాయని తనకు పోలీస్ అధికారులు చెప్పగా విన్నానని పవన్ పేర్కొనడం గమనార్హం. మీడియా వాళ్లు తేజు యాక్సిడెంట్ గురించి కాకుండా ఇలాంటి విషయాలపై ఫోకస్ చేయాలని పవన్ పిలుపునిచ్చాడు.

అలాగే వైఎస్ జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారో దాని మీద దృష్టిపెట్టాలని కూడా పవన్ అన్నాడు. అలాగే 2019 ఎన్నికల ముంగిట సంచలనం రేపిన కోడి కత్తి కేసు వ్యవహారాన్ని కూడా పవన్ ప్రస్తావించాడు. ఒక వ్యక్తి ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేతను కోడి కత్తితో పొడిచాడని.. దీని మీద అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా స్పందించారని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, విచారణ జరపాలని అన్నారని.. కానీ ఈ కేసు ఏమైందో తెలియదని.. దీని మీద మీడియా దృష్టిపెట్టాలని పవన్ వ్యాఖ్యానించాడు.