ఆచార్య…అగమ్యగోచరం

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ అంత స్మూత్ గా వున్నట్లు కనిపించడం లేదు. రీ ఎంట్రీలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్. కానీ సినిమా విడుదలకు ముందు తన రీ ఎంట్రీని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ మాత్రం పడ్డారు. సరే, అది దాటేసారు. కానీ ఆ తరువాత నుంచే స్టార్ట్ అయింది సమస్య. సైరా అనే సినిమాను తలకెత్తుకున్నారు. ఎప్పటికీ పూర్తి కాలేదు. సరే పూర్తి చేసి విడుదల చేసారు. జనం సింపుల్ గా పక్కన పెట్టారు. దాదాపు నలభై కోట్ల నష్టం మిగిలింది అన్నది ఇండస్ట్రీ గ్యాసిప్.

సరే, ఆ సినిమా సంగతి మరిచిపోయి ఆచార్య సినిమాను స్టార్ట్ చేసారు. కొరటాల శివ దర్శకుడు. కానీ ఈ సినిమా పరిస్థితి కూడా అలాగే వుంది. ఇప్పటికి గట్టిగా సగం కూడా పూర్తి కాలేదని టాక్. అసలు అంత సీన్ లేదు ఇరవై శాతమే పూర్తయిందని ఇంకో గ్యాసిప్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని సంకల్పం.

కానీ సినిమాలో రామ్ చరణ్ పాత్ర వ్యవహారం ఇంకా పెండింగ్ లోనే వుంది. ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ ఎప్పుడు వస్తారో? ఎప్పుడు ఆచార్య పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియని సమాధానం. అసలు రామ్ చరణ్ ను వదిలేసుకోవాలా? మరెవర్ని చూసుకోవాలి? అన్నది కూడా క్లారిటీ లేదు. అది రావాలి. ఆపై చరణ్ షూటింగ్ కు రావాలి. నలభై నిమషాలకు పైగా ఫుటేజ్ తీయాలి.

పైగా సినిమా షూట్ జూలై నుంచి మొదలు పెట్టినా ఆరు నెలలు కనీసం వుంటుందని టాక్ వినిపిస్తోంది. అలా అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం అసాధ్యం అవుతుంది. పోనీ సమ్మర్ అనుకుంటే అక్కడ ఆర్ఆర్ఆర్ అడ్డంగా వుంటుంది. మరి కాస్త వెనక్కు వెళ్తే దసరా. ఈ లోగా అనేక టాప్ హీరోల సినిమాలు రెడీ.

ఇలా అన్నీ కలిసి మెగాస్టార్ ఆచార్య పరిస్థితిని అగమ్యగోచరం చేస్తున్నాయి. ఏదో బాధపడి 2021 సమ్మర్ కు దర్శకుడు కొరటాల శివ బయట పడినా ఏ హీరో కూడా రెడీగా లేరు. అప్పటికి మహేష్, ఎన్టీఆర్ ఇలా ఎవ్వరూ రెడీ కారు. ఆఖరికి కొరటాల ఆశలు పెంచుకుంటున్న విజయ్ దేవరకొండ కూడా ఫైటర్ తరువాత రెండు సినిమాలు చేయాలి.

ఇలా ఆచార్య సినిమా డైరక్టర్ కొరటాల శివను అష్టదిగ్బంధనం చేసేసింది.