బప్పీకి వాయిస్ పోయిందా.. ఇదిగో క్లారిటీ


ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లలో బప్పీ లహరి ఒకరు. 80, 90 దశకాల్లో బాలీవుడ్‌ను షేక్ చేసిన సంగీత దర్శకుడాయన. అప్పటిదాకా ఒక స్టయిల్లో సాగిపోతున్న బాలీవుడ్ మ్యూజిక్‌లో మార్పు తీసుకొచ్చి ‘డిస్కో’ పాటలతో అప్పటి యువతను ఊపేశారు బప్పీలహరి. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాలతో తెలుగులోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. సంగీత దర్శకుడిగానే కాక.. గాయకుడిగానూ ఆయనది ప్రత్యేకమైన శైలి.

మ్యూజిక్‌లోనే కాక.. తన ఆహార్యంలోనూ ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది. నిండైన రూపం, నల్లటి కళ్లజోడు, జిగేల్‌మనే డ్రెస్, మెడలో లావుపాటి బంగారు ఛైన్, వేళ్లకు ఉంగరాలతో భలే ఫన్నీగా కనిపిస్తారాయన. ఐతే ఎప్పుడూ హుషారుగా కనిపించే బప్పీ లహరి.. తాజాగా కొవిడ్ బారిన పడ్డారు. వైరస్ ఆయనపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ క్రమంలో బప్పీ లహరి తన వాయిస్ కోల్పోయారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఇది ఆయన అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది.

ఐతే సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా ఉత్త ప్రచారం అని తేలిపోయింది. తన ఆరోగ్యంపై బప్పీనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ ఆయనపై తీవ్ర ప్రభావం ఏమీ చూపలేదు. అసలు ఆయన వాయిస్ పోయిందనేది కూడా రూమరే. తన గొంతుకేమీ కాలేదని ఆయన ఒక పాట పాడి మరీ క్లారిటీ ఇచ్చారు. ముందులా హుషారు కనిపించకపోయినా.. బప్పీ ఒక పాట పాడి తన గురించి జరుతున్న ప్రచారానికి తెరదించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హిందీలో ఆయన పాడిన ‘ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్’ పాట అప్పట్లో ఒక సంచలనం. సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆపేశాక అప్పుడప్పుడూ ఆయన ఒక పాట పాడుతున్నారు.

తెలుగులో కూడా గత ఏడాది ఓ సినిమాలో ఆయన వాయిస్ వినిపించింది. ‘డిస్కో రాజా’ సినిమాలో రంపంపం అంటూ సాగే పాటను రవితేజతో కలిసి బప్పీ లహరి ఆలపించడం విశేషం. ఆ సినిమా ఆడకపోయినా ఈ పాట మంచి స్పందన రాబట్టుకుంది. బప్పీ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని ఇలాగే ఇంకొన్నేళ్లు పాటలు పాడుతూ అభిమానులను అలరించాలని కోరుకుందాం.