‘రిపబ్లిక్’ ట్రైలర్ బాగుంది కానీ..


కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఆ సినిమాకు బాక్సాఫీస్ పరిస్థితులు కలిసొచ్చి వసూళ్లు బాగానే వచ్చాయి కానీ.. ప్రేక్షకులు చాలా వరకు ఈ సినిమా చూసి పెదవి విరిచారు. తేజు కొంచెం బలమైన కథలతో రావాలనే అభిప్రాయం వినిపించిందప్పుడు. అందుకు తగ్గట్లే అతను ‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్టా డైరెక్షన్లో ‘రిపబ్లిక్’ సినిమాను లైన్లో పెట్టాడు. ‘ప్రస్థానం’ తరహాలోనే రాజకీయ, సామాజిక అంశాలతో ఒక సీరియస్ కథను చెప్పే ప్రయత్నం చేసినట్లున్నాడు దేవా ఈ చిత్రంలో.

అక్టోబరు 1న ‘రిపబ్లిక్’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బుధవారం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా దీని ట్రైలర్ లాంచ్ చేశారు. మిగతా వ్యవస్థలన్నింటినీ కమ్మేసి ఆధిపత్యం చలాయిస్తున్న పొలిటికల్ సిస్టమ్ మీద పోరాటం చేసే సివిలి సర్వెంట్ పాత్రలో తేజు చాలా ఎఫెక్టివ్‌గా కనిపిస్తున్నాడు సినిమాలో.

ట్రైలర్ ఆద్యంతం ఒక ఇంటెన్సిటీతో సాగి ఆకట్టుకుంది. విజువల్స్ బాగున్నాయి. తేజు పాత్రతో పాటు రమ్యకృష్ణ, జగపతిబాబు క్యారెక్టర్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఐతే అంతా బాగుంది కానీ.. ఇంత సీరియస్ సినిమా ఈ రోజుల్లో ఏమాత్రం ఆడుతుందనే డౌట్లు కొడుతున్నాయి. ఈ తరం ప్రేక్షకులు సీరియస్ సినిమాల పట్ల అంతగా ఆసక్తి ప్రదర్శించట్లేదు. అందులోనూ సామాజిక అంశాలు, సందేశాలు అంటే నిరాసక్తతతో కనిపిస్తున్నారు. ఎంటర్టైనర్లకే ఎక్కువగా పట్టం కడుతున్నారు.

సినిమాలు సీరియస్‌గా ఉన్నప్పటికీ మాస్, కమర్షియల్ అంశాలు ఉంటే నడిచిపోతుంది కానీ.. పూర్తిగా సామాజిక అంశాలు, సందేశం మిళితమై నడిచే కథలు ఈ రోజుల్లో ఆడటం అరుదుగానే ఉంటోంది. దేవా తీసిన ‘ప్రస్థానం’ గొప్ప సినిమా అంటారు కానీ.. అది బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడని విషయం గమనార్హం. మరి ‘రిపబ్లిక్’ ఈ అంచనాల్ని దాటి ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ విజేతగా నిలిచి దేవా ఇలాంటి సినిమాలు మరిన్ని తీసేలా స్ఫూర్తినిస్తుందేమో చూడాలి.