ఆంధ్రప్రదేశ్ జనాల సినిమా పిచ్చి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియా మొత్తంలో అలాంటి సినీ అభిమానం ఇంకెక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికే ఏ పెద్ద సినిమా రిలీజైనా బెనిఫిట్ షోలు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ షోల హంగామా నడుస్తుంటుంది. చాలా సినిమాలకు తెల్లవారుజామన షోలు పడుతుంటాయి. వీటికి ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు అమ్మడం కామనే. పెద్ద హీరోల సినిమాలు రిలీజైనపుడు ఈ బెనిఫిట్ షోల హంగామానే వేరుగా ఉంటుంది.
ఐతే కరోనా కారణంగా గత ఏడాదిన్నరలో రిలీజైన పెద్ద సినిమాలే తక్కువ. దీంతో ఈ స్పెషల్ షోల సందడే లేకపోయింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఈ షోలకు అనుమతులు ఆపేసింది. వకీల్ సాబ్‌కు ప్లాన్ చేసిన షోలన్నీ క్యాన్సిల్ అయిపోవడం తెలిసిందే.
ఐతే ఇది తాత్కాలికమే అని.. మళ్లీ బెనిఫిట్ షోల హంగామా త్వరలోనే మొదలవుతుందని ఆశించిన వాళ్లకు పెద్ద షాక్ తగిలింది. ఇకపై ఏపీలో బెనిఫిట్ షోలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. టికెట్ల ధరలు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో సమావేశమైన సినీ పెద్దల్లో ఒకరైన సి.కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏపీలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఆయన తేల్చేశారు. ఈ షోల టికెట్ల ధరలపై ఏమాత్రం నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వానికి వీటి ద్వారా పన్ను ఆదాయం పెద్దగా లేకపోవడం, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మాయాజాలం నడుస్తుండటంతో ఏపీ సర్కారు ఇకపై బెనిఫిట్ షోలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై ఇండస్ట్రీ జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి. తెలంగాణలో చాలా ఏళ్ల నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వట్లేదన్న సంగతి తెలిసిందే.