చైతూ.. ఈ అబ్బాయి చాలా మంచోడు


ఈ అబ్బాయి చాలా మంచోడు అని రవితేజ నటించిన ఓ సినిమా. ఐతే ఇప్పుడు టాలీవుడ్లో అక్కినేని నాగచైతన్యకు ఈ టైటిల్ బాగా సూటవుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. చైతూకు ఇప్పటికే చాలామంది ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. తాజాగా ఓవైపు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. చైతూ చాలా మంచోడంటూ చాలా గట్టిగా సర్టిఫై చేశారు.

ఆమిర్ ఖాన్ అయితే చైతూ తల్లిదండ్రులతో పాటు అతడి అభిమానులందరికీ కేవలం ఈ విషయం చెప్పడానికే తాను ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చి ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నట్లుగా చెప్పడం విశేషం. ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసమని చైతూ 45 రోజుల పాటు ఆమిర్ ఖాన్‌తో గడిపాడు. ఐతే ఇన్ని రోజులు కలిసి షూటింగ్‌లో పాల్గొన్నంత మాత్రాన ఆమిర్ ఖాన్.. చైతూ కోసం హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు.

చైతూ వ్యక్తిత్వం ఆమిర్‌కు చాలా నచ్చేసిందని.. తనకు అతను చాలా సన్నిహితుడు అయిపోయాడని తన మాటల్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఆమిర్ చైతూ గురించి చెప్పిన ప్రతి మాటా.. అతడికిచ్చిన ప్రతి కితాబూ హృదయంలోంచి వచ్చిందన్నది క్లియర్‌గా తెలుస్తోంది. మరో నటుడు అయితే ఆమిర్‌తో పని చేసే అవకాశం దక్కినందుకు ఉబ్బితబ్బిబ్బయిపోయి.. అతణ్ని ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేసి ఉంటాడేమో. చైతూ వ్యక్తిత్వం ప్రకారం చూస్తే అతను అలా చేయకుండా ఆమిర్‌తో నిజాయితీగా, హుందాగా, సింపుల్‌గా వ్యవహరించినట్లున్నాడు. నో నాన్సెన్స్ లాగా కనిపించే అతడి తీరు, నిజాయితీ, సింప్లిసిటీ ఆమిర్‌కు నచ్చి ఉండొచ్చు. అందుకే ఇక్కడిదాకా వచ్చి చైతూను పొగిడాడని అనిపిస్తోంది.

మరోవైపు చిరంజీవి సైతం చైతూ గురించి ఇలాగే మాట్లాడాడు. చాలామంది యువ కథానాయకుల్లాగా అతను ఎగిరెగిరి పడడని.. హుందాగా, కూల్‌గా ఉంటాడని కితాబిచ్చాడు. చైతూ గురించి ఇండస్ట్రీలో చాలామంది చెప్పే మాటలు ఇవే. మొత్తానికి పరిశ్రమలో చైతూ అంటే చాలా మంచోడు అనే పేరుందని స్పష్టమవుతోంది. చిరు, ఆమిర్ ఇలా పొగిడాక ఇంత మంచోడితో సమంతకు ఎక్కడ తేడా కొట్టింది.. ఎందుకు వీరి మధ్య అంతరం వచ్చింది అనే చర్చ నడుస్తుండటం గమనార్హం.