పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు.. ఒకప్పుడు స్టార్ రైటర్ కోన వెంకట్ ఆహా ఓహో అంటూ తెగ పొగిడేసే వాడు. పవన్ తన సోల్ మేట్ అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లే ఇచ్చాడు కోన అప్పట్లో. తనకు, పవన్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు కూడా చెప్పుకునేవాడు. అలాంటి వాడు 2019 ఎన్నికల ముంగిట పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారు అయిన కోన.. పవన్ జనాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ చేసిన వ్యాఖ్య చర్చనీయాంశం అయింది. సాక్షిలో వచ్చిన ఆ ఇంటర్వ్యూ పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అప్పట్నుంచి కోన పేరెత్తితే వాళ్లు మండిపోతున్నారు. ట్విట్టర్లో వాళ్ల సెగ తరచుగా కోనకు తగులుతూనే ఉంటుంది. ఐతే ఇప్పుడు కోన… పవన్, ఆయన అభిమానులతో ప్యాచప్ కోసం ప్రయత్నిస్తున్నట్లుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు, పవన్‌కు మధ్య గ్యాప్ రావడానికి కారణం మీడియానే అని తేల్చేశారాయన. పవన్ గురించి తాను అన్న మాట ఒకటైతే.. ఆ ఇంటర్వ్యూలో ప్రచురితమైంది మరో మాట అని కోన అన్నాడు. తాను ‘అమాయకత్వం’ అనే పదం అంటే.. పత్రికలో మాత్రం ‘విద్వేషం’ అని వచ్చిందని కోన తెలిపాడు. దీనిపై ఆ ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్‌కు ఫోన్ చేసి నిలదీసినట్లు కూడా కోన తెలిపాడు.
ఐతే ఈ వివరణతో పవన్ అభిమానులు శాంతిస్తారా అన్నది సందేహమే. ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ మిస్సవుతోంది. తాను అనని మాటల్ని ఇంటర్వ్యూలో రాసినపుడు.. కోన అప్పుడు దానిపై ఖండన ఇచ్చి ఉండొచ్చు. తాను ‘విద్వేషం’ అనే మాట వాడలేదని చెప్పి ఉండొచ్చు. అవసరమైతే ఇంటర్వ్యూ పబ్లిష్ చేసిన పత్రికతో ‘సవరణ’ ఇప్పించి ఉండొచ్చు. కానీ అప్పుడా పని చేయలేదంటే దాని ఉద్దేశమేంటి? అప్పుడలా సర్దుకుపోయి.. ఇప్పుడొచ్చి తాను ఆ మాట అనలేదు అంటే పవన్ ఫ్యాన్స్ ఎలా మన్నిస్తారు?
Gulte Telugu Telugu Political and Movie News Updates