శంకర్-చరణ్.. పక్కా లోకల్

తొలి సినిమా ‘జెంటిల్‌మ్యాన్’తోనే సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడిగా మారాడు శంకర్. ఇక అప్పట్నుంచి అతడితో సినిమా చేయాలని టాలీవుడ్ బడా హీరోలు ఎంతగానో కోరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఓ సందర్భంలో బహిరంగంగానే తన కోరికను వెల్లడించాడు. కానీ తమిళంలో దర్శకుడిగా మారిన 28 ఏళ్లకు కానీ శంకర్.. టాలీవుడ్లోకి అడుగు పెట్టలేదు. ఎట్టకేలకు రామ్ చరణ్ హీరోగా శంకర్ తెలుగు సినిమాను మొదలుపెట్టాడు. ఇది పాన్ ఇండియా మూవీనే అయినప్పటికీ.. బేసిగ్గా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం.

బుధవారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆరంభ వేడుకకు. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి పని చేస్తున్న కాస్ట్ అండ్ క్రూ గురించి ఊహాగానాలకు తావు లేకుండా ఈ పోస్టర్‌తోనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పాన్ ఇండియా సినిమా కదా అని మనకు పరిచయం లేని పరభాషా నటీనటులు, టెక్నీషియన్లతో నింపేయకుండా మన వాళ్లను, మన వాళ్లకు బాగా తెలిసిన వాళ్లనే ఈ చిత్రానికి తీసుకున్నారు. చాలామంది శంకర్ తనకు కంఫర్ట్‌గా ఉండేలా కోలీవుడ్ వాళ్లను తీసుకొస్తాడనే అనుకున్నారు. కానీ జనతా గ్యారేజ్ సహా పలు తెలుగు చిత్రాలకు పని చేసిన తిరును కెమెరామన్‌గా ఎంచుకున్నాడు. సంగీత దర్శకుడిగా మన వాళ్లు బాగా కనెక్టయ్యే తమన్‌ను తీసుకున్నాడు.

ప్రొడక్షన్ డిజైనర్లుగా శంకర్ మామూలుగా సాబు సిరిల్ లాంటి టాప్ టెక్నీషియన్లను తీసుకుంటుంటాడు. కానీ ఈ చిత్రానికి మాత్రం ‘రంగస్థలం’కు పని చేసిన అచ్చ తెలుగు టెక్నీషియన్లు రామకృష్ణ-మోనికలను ఓకే చేశాడు. ఇక ఈ చిత్రానికి రచయిత సాయిమాధవ్ బుర్రా అన్న సంగతి తెలిసిందే. కేవలం మాటలకు పరిమితం కాకుండా ఆయన స్క్రిప్టులోనూ భాగస్వామి కావడం విశేషం.

ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి.. ఇలా చాలా వరకు తెలుగు నటులే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ నటుడు జయరాం కూడా మన వాళ్లకు బాగానే పరిచయం. మొత్తంగా చూస్తే ఈ చిత్రంలో లోకల్ టచ్ బాగా కనిపిస్తోంది. మరి దీనికి మున్ముందు పాన్ ఇండియా అప్పీల్ ఎలా తీసుకొస్తారో చూడాలి.