దర్శకులు అప్పుడప్పుడూ లిరిసిస్టులుగా మారడం మామూలే. స్వతహాగా రచనా నేపథ్యం నుంచి వచ్చిన వారికి పాట రాయడం పెద్ద కష్టమేమీ కాదు. ఐతే పాట రాయడం వరకు ఓకే కానీ.. ఆ పాటను దర్శకుడే ఆలపించడం మాత్రం అరుదైన విషయమే. యువ దర్శకుడు శివ నిర్వాణ ఆ అరుదైన పనే చేశాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం టక్ జగదీష్ కోసం ఒక పాట రాసి.. దాన్ని స్వయంగా ఆలపించాడు. టక్ జగదీష్‌లో హీరో పాత్రకు ఎలివేషన్ ఇచ్చే టక్ సాంగ్ ఇది కావడం విశేషం.
సల్లాటి కుండలో సల్లసుక్క మనసువాడు.. నువ్వు గిల్లి గిచ్చి రెచ్చగొడితే వచ్చి దంచుతాడు.. అంటూ అల వైకుంఠపురములో క్లైమాక్స్‌లో వచ్చే సిత్తరాల సిరపడు తరహా జానపద గేయం ఇది. ఈ పాటను ఒక ఆసక్తికర వీడియో ద్వారా లాంచ్ చేశారు.
ముందు సంగీత దర్శకుడు గోపీ సుందర్ ట్యూన్ వినిపించడం.. అది భలేగా ఉందని శివ దానికి సాహిత్యం సమకూర్చడం.. ఈ పాటను నాని పాడితే బాగుంటుందని శివ అనడం.. తర్వాత ఇద్దరూ కలిసి నాని దగ్గరికెళ్లడం.. అదనేమో అయిష్టత వ్యక్తం చేస్తూ ఈ పాటను శివనే ఆలపిస్తే బాగుంటుందనడం.. చివరికి శివనే ఈ పాటను ఆలపించడం.. ఇలా సాగింది ఈ వీడియో.
ఐతే సాహిత్యం వరకు ఓకే కానీ.. శివ ఈ పాట ఆలపించిన తీరైతే ఏమంత బాగా లేదు. ప్రొఫెషనల్ సింగర్‌ను పెడితే ఈ పాటకు ప్రత్యేకత చేకూరేది అనిపించింది. మరి సినిమాలో శివ వాయిస్ ఓకే అనిపిస్తుందేమో చూడాలి. ఇది బిట్ సాంగే కాబట్టి మరీ ఇబ్బంది లేకపోవచ్చు. ఈ చిత్రానికి తమనే సంగీత దర్శకుడు అయినప్పటికి.. ఈ మధ్య మరీ బిజీ అయిపోవడంతో నేపథ్య సంగీతంతో పాటు ఈ పాట వరకు గోపీసుందర్ బాధ్యత తీసుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates