భీమ్లా పాటపై ఐపీఎస్ అధికారి అభ్యంతరం


సోషల్ మీడియా చాలా కీలకంగా మారిన ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలు కూడా వివాదాస్పదం అయిపోతున్నాయి. సినిమాలకు సంబంధించిన విషయాలైతే చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సమయాల్లో ఫిలిం మేకర్స్ ఏం చేసినా.. కాస్త ముందు వెనుక చూసుకుని చేయాల్సిందే. ఏమాత్రం శ్రుతి తప్పినా కాంట్రవర్సీలు తప్పవు.

నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడం తెలిసిందే. పవన్ పోషించిన పోలీస్ పాత్ర వీరత్వాన్ని, కఠినత్వాన్ని చాటేలా ఆ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. తమన్ తనదైన శైలిలో దాన్ని కంపోజ్ చేశాడు. అభిమానులకైతే ఈ పాట బాగానే నచ్చుతోంది.

కానీ ఈ పాట విషయంలో ఇప్పుడు ఓ పోలీస్ ఉన్నతాధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల మంచి కంటే చెడును ఎలివేట్ చేసేలా ఈ పాట ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ అయిన ఎం.రమేష్.. ‘భీమ్లా నాయక్’ పాట గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు.

తెలంగాణ పోలీసులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని.. ఈ పాటలో అన్నట్లుగా తాము ఎముకలు విరగ్గొట్టమని ఆయనన్నారు. ప్రజలను కాపాడ్డానికే తమకు జీతాలిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రామజోగయ్య శాస్త్రికి పోలీసుల గురించి వర్ణించడానికి తెలుగులో వేరే పదాలే దొరక్కపోవడం ఆశ్చర్యకరమని ఆయనన్నారు. పోలీసుల సేవల గురించి ఈ పాటలో ఏమీ లేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై ‘భీమ్లా నాయక్’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.