2017లో టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ డ్రగ్స్ కేసు విచారణలోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను ఈడీ దాదాపు 10 గంటల పాటు విచారణ జరిపింది. అయితే, నాలుగేళ్లుగా అటకెక్కిన ఈ కేసు మళ్లీ తెరపైకి రావడం, ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం వెనుక డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఉన్నట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఈడీకి కెల్విన్ అప్రూవర్ గా మారడంతోనే ఈ వ్యవహారంలో 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చిందని తెలుస్తోంది. కెల్విన్ అందించిన సమాచారంతోనే సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయని తెలుస్తోంది. కెల్విన్ చెప్పిన వివరాల ఆధారంగా ఇక్కడి నుంచి విదేశాలకు భారీగా నగదు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించిందని ప్రచారం జరుగుతోంది. అందుకే, పూరీ జగన్నాథ్ విచారణ సమయంలోనూ ప్రధానంగా నగదు బదిలీపైనే ఈడీ ఫోకస్ చేసిందని, 2015 నుంచి పూరీ బ్యాంకు ఖాతాల వివరాలపై ఆరా తీసిందని తెలుస్తోంది.
ఆఫ్రికా దేశాలకు కూడా పూరీ నగదు పంపినట్లు బ్యాంకు స్టేట్ మెంట్లో ఉందని, కెల్విన్ ఖాతాలకు పూరీ డబ్బు ఎందుకు పంపారని కూడా ఈడీ ప్రశ్నించిందని తెలుస్తోంది. పూరీ బ్యాంకు లావాదేవీలను, కెల్విన్ బ్యాంకు స్టేట్ మెంట్లను ఈడీ అధికారులు పూరీ ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారని, అందుకే 10 గంటలపాటు విచారణ సాగిందని తెలుస్తోంది. పూరీ తర్వాత విచారణకు హాజరు కాబోయే సినీ ప్రముఖులకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుందని తెలుస్తోంది.
వాస్తవానికి, కెల్విన్ ను గతంలోనే ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపారు. కానీ, ఆ సందర్భంగా కెల్విన్ నోరు మెదపలేదని తెలుస్తోంది. కానీ, 6 నెలల క్రితం కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ మొదలుబెట్టింది. గత 6 నెలలుగా దాదాపు 12 సార్లు కెల్విన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారని, కెల్విన్ బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారని తెలుస్తోంది.
ఇక, ఈడీ తమదైన శైలిలో విచారణ జరపడంతో కెల్విన్ నోరు విప్పక తప్పని పరిస్థితి వచ్చిందట. ఈ క్రమంలోనే కెల్విన్ అప్రువర్ గా మారి, పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించాడని తెలుస్తోంది. త్వరలోనే కెల్విన్ ఖాతాలను సీజ్ చేసిన తరహాలోనే సినీ ప్రముఖుల బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసే యోచనలో ఈడీ ఉందని తెలుస్తోంది. కెవిన్ అప్రూవర్ గా మారి సినీ ప్రముఖులను అడ్డంగా బుక్ చేశాడన్న టాక్ వస్తోంది.