లవ్ స్టోరి మళ్లీ వాయిదా?

కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కొత్త సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించడం.. మళ్లీ రీషెడ్యూల్ చేయడం చాలా మామూలు విషయం అయిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరవడే. ఏ పరిశ్రమా అందుకు మినహాయింపు కాదు. టాలీవుడ్ విషయానికి వస్తే గత ఏడాది వ్యవధిలో అన్ని ప్రధాన చిత్రాలకూ రిలీజ్ డేట్లు ఇవ్వడం.. తర్వాత వాయిదా వేయడం చూస్తూనే ఉన్నాం.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మూడోసారి వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో చాలా చిత్రాలే ఉన్నాయి. ఐతే ఇటీవల థియేటర్లు పున:ప్రారంభమై మునుపటిలా నడిచే దిశగా అడుగులు పడుతుండటంతో ‘లవ్ స్టోరి’ లాంటి క్రేజీ మూవీకి కొత్తగా రిలీజ్ డేట్ ఇచ్చారు.

ఏప్రిల్ 16 నుంచి వాయిదా వేశాక.. చాన్నాళ్లు వెయిట్ చేసి సెప్టెంబరు 10న వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మధ్యే రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ‘లవ్ స్టోరి’ సెప్టెంబరు 10న విడుదల కావట్లేదట. సెప్టెంబరు నెలాఖరుకు సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధతే ‘లవ్ స్టోరి’ వాయిదాకు కారణమని తెలుస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ఆలస్యమవుతుండటం.. ఈ మీటింగ్‌లో కూడా టికెట్ల రేట్ల పంచాయితీ తెలుగుతుందన్న క్లారిటీ లేకపోవడంతోనే ‘లవ్ స్టోరి’ని వాయిదా వేయాలని, పూర్తిగా పరిస్థితులు చక్కబడ్డాకే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘లవ్ స్టోరి’ వాయిదాపై క్లారిటీ వచ్చాకే ‘టక్ జగదీష్’ చిత్రాన్ని సెప్టెంబరు 10న రిలీజ్ చేయడానికి దాని నిర్మాతలు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ‘లవ్ స్టోరి’ 10న వచ్చేట్లయితే కొంచెం లేటుగానే ‘టక్ జగదీష్’ ప్రిమియర్స్ ప్లాన్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ చిత్రం వాయిదా పడటం ఖాయమని సంకేతాలు రావడంతోనే ఈ చిత్రాన్ని వినాయక చవితికి షెడ్యూల్ చేసినట్లు సమాచారం.