గత ఆరేడేళ్లలో తెలుగు సినిమాలకు బంగారు బాతులా మారింది యుఎస్ మార్కెట్. అక్కడ ఇండియాలో మిగతా అన్ని భాషా చిత్రాల కంటే తెలుగు సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. బాహుబలి రెండు భాగాలకు కలిపి రూ.200 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయంటే మన సినిమాలకు అక్కడున్న మార్కెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అన్నీ బాహుబలి స్థాయికి వెళ్లకపోయినా.. మన బడా స్టార్ల సినిమాలకు రూ.25-30 కోట్ల మేర హక్కులు పలికే రేంజికి మార్కెట్ ఎగబాకింది. ఐతే కరోనా దెబ్బకు ఈ మార్కెట్ అంతా గల్లంతయిపోయింది.
వైరస్ దెబ్బకు ఇక్కడ లాగే అక్కడా థియేటర్లు మూతపడ్డాయి. మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. నెమ్మదిగి థియేటర్లు పునఃప్రారంభం అయినా సరే.. ముందులా సందడి కనిపించట్లేదు. ఎన్నారై ప్రేక్షకులు మునుపట్లా థియేటర్లకు పెద్ద ఎత్తున రావట్లేదు. బాగా ఓటీటీలకు అలవాటు పడిపోవడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు. యుఎస్‌లో టికెట్ల రేట్లు బాగా ఎక్కువ. ఒక సినిమా చూసే రేటుతో ఒక ఓటీటీ సబ్‌స్క్రిప్షనే వచ్చేస్తోంది. పైగా కొత్త సినిమాలు చాలానే ఓటీటీలో రిలీజవుతున్నాయి. వీటికి అలవాటు పడి కొత్త సినిమాల కోసం థియేటర్లకు పరుగులు పెట్టే రోజులు పోయాయి.
అందులోనూ స్టార్ల సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోవడం మైనస్ అయింది. దీంతో తెలుగు ఎన్నారైల సినిమా కల్చరే మారిపోయి తెలుగు చిత్రాల యుఎస్ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఒకప్పట్లా భారీ చిత్రాలు వచ్చాక పరిస్థితులు నెమ్మదిగా మెరుగు పడొచ్చేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇప్పుడు కొత్త ప్రిమియర్స్ పడటమే గగనంగా ఉండగా.. ఒకవేళ అవి ప్లాన్ చేసినా ఓపెనింగ్స్ నామమాత్రంగా ఉంటున్నాయి. రాజ రాజ చోర చిత్రానికి మంచి టాక్ వచ్చినా వీకెండ్లో లక్ష డాలర్లు కూడా వసూలయ్యే పరిస్థితి లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.