ఆహా.. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఏడాదిన్నర కిందట పెద్దగా అంచనాల్లేకుండా మొదలుపెట్టిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్. అప్పటికే బోలెడన్ని ఓటీటీలు అందుబాటులో ఉన్నప్పటికీ ‘ఆహా’ తన ప్రత్యేకతను చాటుకోగలిగింది. పైగా కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే అందిస్తూ ఇది నిలబడటం విశేషం.
ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు సహా కంటెంట్ అంతా తెలుగులోనే ఉంటుంది. తమిళం, మలయాళం, కన్నడ భాషల నుంచి కూడా సినిమాలు తీసుకొస్తారు కానీ.. వాటిని తెలుగులోకి అనువదించే రిలీజ్ చేస్తారు. వేరే భాషల్లో కంటెంట్ ఉండదు. అందుకే దీన్ని 100 పర్సంట్ తెలుగు యాప్ అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు.
ఐతే త్వరలోనే ఆ ట్యాగ్ తీసేయబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే ‘ఆహా’లోకి వేరే భాషల్లోకి కూడా తీసుకెళ్లేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే రెండేళ్లలో ఈ దిశగా బలమైన అడుగులే వేయనున్నారట.
తాజాగా ఆహా కోసం కొత్త ఆఫీస్ తెరిచారు. ఇది కాస్త పెద్దదే. తెలుగు కంటెంట్‌ను విస్తరించడంతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోకి కూడా ఆహా యాప్‌ను తీసుకెళ్లనున్నారట. అందుకోసమే కొత్త ఆఫీస్‌లోకి ఆహా టీం వెళ్లిందట. మరింత స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకుని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఈ మూడు భాషల్లో ఓటీటీని లాంచ్ చేయనున్నారని.. ఇంకో రెండేళ్లలో నాలుగు భాషల్లో ఆహా అందుబాటులో ఉంటుందని సమాచారం.
గత ఏడాది హైదరాబాద్‌లో కొత్తగా అల్లు స్టూడియోస్ నిర్మాణం కూడా మొదలైన సంగతి తెలిసిందే. అక్కడే పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌లు, షోల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓటీటీల్లో ఒకటిగా ఎదిగే దిశగా అల్లు అరవింద్ గట్టి సన్నాహాల్లోనే ఉన్నారని స్పష్టమవుతోంది. మరి ఒకే యాప్‌లో వేర్వేరు భాషల కంటెంట్ అందబాటులో ఉంచుతారా లేక ఏ భాషకు ఆ భాషలో యాప్ తెస్తారా అన్నదే చూడాలి.