టాలీవుడ్లో నెమ్మదిగా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక గత మూడు వారాల్లో పెద్ద సంఖ్యలోనే సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న క్రేజీ చిత్రాలు మాత్రం విడుదలకు నోచుకోవడం లేదనే అసంతృప్తి ఉంది. ఫస్ట్ కాపీలతో రెడీగా ఉన్న సినిమాల్లో కొన్ని ఓటీటీ బాట పట్టగా.. థియేటర్లలోనే రావాలి చూస్తున్న చిత్రాలను హోల్డ్‌లో పెట్టారు. ఇందుకు ప్రధాన కారణం.. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ సాగుతుండటం.
వేసవిలో ‘వకీల్ సాబ్’ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టడం కోసమేనా అన్నట్లుగా పాత జీవోలను బయటికి తీసి టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చింది ఏపీ సర్కారు. దీనిపై ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ.. వెంటనే నిర్ణయాన్ని మార్చలేక అవే రేట్లను కొనసాగిస్తున్నారు. ఐతే దీనిపై చర్చించడానికే చిరు నేతృత్వంలోని ఓ బృందం జగన్ దగ్గరికి వెళ్తోంది.
ఆ సమావేశానికి ముందే ఇండస్ట్రీ పెద్దలతో చిరు సమావేశం నిర్వహించాడు. మీటింగ్‌లో ఏం మాట్లాడాలనేదానిపైనే కాక.. ప్రభుత్వం నుంచి సమస్యలపై సానుకూల ధోరణి ఉన్న విషయాన్ని చిరు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిన టికెట్ల రేట్ల విషయంలో సడలింపులు కచ్చితంగా ఉంటాయనే అభిప్రాయాలు ఇందులో వ్యక్తమయ్యాయట.
ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ కీలక వ్యక్తుల్లో ఒకరైన సునీల్ నారంగ్ తమ నిర్మాణంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరి’ని సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్లు ప్రకటన కూడా చేశారంటున్నారు. ఈ బాటలోనే గోపీచంద్ మూవీ ‘సీటీ మార్’కు కూడా డేట్ ఇచ్చేస్తున్నారు. ఈ రోజే ప్రకటన రాబోతోంది. అది సెప్టెంబరు మూడో వారంలో వచ్చే అవకాశాలున్నాయి. ఏపీలో చిన్న సెంటర్లలో కూడా మినిమం రూ.100 ఉండేలా టికటె్ల రేట్ ఫిక్స్ చేస్తారనే ఆశతో ఇండస్ట్రీ జనాలున్నారు. అదే జరిగితే రాబోయే రోజుల్లో సినిమాల జాతరన్నమాటే.