బాలీవుడ్‌కు ఎంత క‌ష్ట‌మొచ్చిందంటే..


బాలీవుడ్‌కు కేంద్రం… అంటే ముంబ‌యి న‌గ‌ర‌మే. హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ ప‌ని చేసేదే ఆ న‌గ‌రం నుంచే. మ‌రి ఆ సిటీలో థియేట‌ర్ల‌న్నీ మూత ప‌డి ఉండ‌గా ఒక హిందీ సినిమా విడుద‌ల కావ‌డాన్ని ఊహించ‌గ‌ల‌మా? అందులోనూ అది అక్ష‌య్ కుమార్ లాంటి సూప‌ర్ స్టార్ నటించిన సినిమా కావ‌డం అనూహ్యం. ఇప్పుడు అదే జ‌రుగుతోంది. అక్ష‌య్ ప్ర‌ధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం బెల్ బాట‌మ్.. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది.

కానీ మ‌హారాష్ట్ర‌లో ముంబ‌యి స‌హా ప‌లు ప్రాంతాల్లో థియేట‌ర్లు మూత‌ప‌డే ఉన్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ బ్రేక్ త‌ర్వాత థియేట‌ర్ల‌ను తెరిచిన‌ట్లే తెరిచి మూయించేశారు. క‌రోనా మూడో వేవ్ ముప్పును నివారించ‌డానికే ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని మార్చింది. ఐతే థియేట‌ర్లు తెరుచుకోగానే బెల్ బాట‌మ్ చిత్రానికి రిలీజ్ డేట్ ఇచ్చారు. త‌ర్వాత వాయిదా వేశారు. చివ‌రికి ఆగ‌స్టు 19న ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయ‌డానికే డిసైడ‌య్యారు.

కొన్ని రోజుల త‌ర్వాత ప‌రిస్థితులు మారుతాయేమో, ముంబ‌యి స‌హా ఇత‌ర ప్రాంతాల్లో థియేట‌ర్లు తెరుచుకుంటాయేమో అని చూశారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. మిగ‌తా అన్ని చోట్లా బెల్ బాట‌మ్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జ‌రిగాయి. సినిమాను ఆపేకొద్దీ న‌ష్ట‌మే అని భావించి.. ఇక రిలీజ్ చేయ‌డానికే చిత్ర బృందం నిర్ణ‌యించుకుంది. ఇంత పెద్ద హిందీ సినిమా రిలీజ‌వుతుంటే.. ముంబ‌యిలో థియేట‌ర్ల‌న్నీ మూత ప‌డి ఉండ‌టం అక్క‌డి సినీ ప్రియుల‌కు.. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ల‌కు తీవ్ర ఆవేద‌న క‌లిగించేదే.

బాలీవుడ్ ఎలాంటి స్థితిలో ఉందో చెప్ప‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమాకు మంచి ఫ‌లితం ద‌క్కి.. ఆ త‌ర్వాత అయినా థియేట‌ర్లు తెరుచుకుంటే మ‌రిన్ని పెద్ద సినిమాల‌ను విడుద‌ల చేయ‌డానికి బాలీవుడ్ రెడీ అవుతోంది. మ‌రి బెల్ బాట‌మ్ మూవీకి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.