మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ వార్


మెగాస్టార్ పెద్ద మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. హీరోగా అతడి తొలి చిత్రం ‘రేయ్’ పరిస్థితి ఏమైందో తెలిసిందే. సినిమా మొదలైన మూడేళ్లకు కూడా విడుదలకు నోచుకోని పరిస్థితుల్లో తేజు హీరోగా ఇంకో సినిమా మొదలుకావడం.. ముందు అదే రిలీజ్ కావడం తెలిసిందే. ఆ సినిమా హిట్టవడంతో తేజు కెరీర్ గాడిన పడింది. ఆ తర్వాత అతను పడుతూ లేస్తూ హీరోగా కొనసాగుతున్నాడు.

మధ్యలో అరడజను ఫ్లాపులతో అతను అల్లాడిపోతుంటే.. చిత్రలహరి, ప్రతి రోజూ పండగే బాగా ఆడి అతడికి ఉపశమనాన్నిచ్చాయి. తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు తేజు నుంచి ‘రిపబ్లిక్’ అనే సీరియస్ మూవీ వస్తోంది. ‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్టా రూపొందించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే తేజు వచ్చిన వారానికే అతడి తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం విశేషం. అన్నలా ఇబ్బంది పడకుండా తొలి చిత్రం ‘ఉప్పెన’తో భారీ విజయాన్నందుకుని యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవ్.. తొలి చిత్రం విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ ఇందులో కథానాయిక. ‘కొండపొలం’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన వైవిధ్య చిత్రమిది. పూర్తిగా అటవీ నేపథ్యంలో నడుస్తుంది. ఈ చిత్రం గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్నా.. దీని గురించి ఇప్పటిదాకా అప్‌డేటే లేదు.

ఐతే ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా టైటిల్ లాంచ్ చేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారట. అక్టోబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయంచినట్లు సమాచారం. అంటే తేజు సినిమా థియేటర్లలో ఉండగానే.. దానికి పోటీగా తమ్ముడి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందన్నమాట.