ప్రి రిలీజ్ ఈవెంట్లు, ఆడియో వేడుకల్లో తమ సినిమాల గురించి టీంలోని ముఖ్యులు ఆహా ఓహో అని చెప్పుకోవడం మామూలే. ఈ క్రమంలో కొన్ని సంచలన స్టేట్మెంట్లు కూడా ఇస్తుంటారు. శనివారం విడుదలైన పాగల్ మూవీ గురించి విశ్వక్సేన్ ఎంతెంత స్టేట్మెంట్లు ఇచ్చాడో తెలిసిందే. మూసుకున్న థియేటర్లు కూడా తెరిపించేస్తా ఈ సినిమాతో అని అతనన్నాడు. తీరా చూస్తే ఆ సినిమాలో అంతగా విషయం లేకపోవడంతో నెటిజన్లు విశ్వక్‌ను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.
ఇదంతా చూస్తూ కూడా ఈ గురువారం విడుదల కాబోతున్న తన కొత్త చిత్రం రాజ రాజ చోర గురించి ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు హీరో శ్రీ విష్ణు. ఈ సినిమా ఇండియాలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లోనూ రీమేక్ అవుతుందని.. ఇది రాసి పెట్టుకోవాలని శ్రీ విష్ణు అన్నాడు. ఇది తెలుగు సినిమా అని మన వాళ్లు గొప్పగా చెప్పుకునేలా ఈ చిత్రం ఉంటుందని కూడా అతనన్నాడు.
రాజ రాజ చోర సినిమా కథ మరీ కొత్తదేమీ కాదని.. కానీ స్టోరీ టెల్లింగ్ చాలా కొత్తగా ఉంటుందని.. అది అన్ని భాషల ఫిలిం మేకర్లనూ ఆకర్షిస్తుందని శ్రీవిష్ణు చెప్పాడు. ఈ సినిమాకు వెళ్లే వాళ్లు ఆరు మాస్కులు తీసుకెళ్లాలని విష్ణు అన్నాడు. ప్రథమార్ధంలో నవ్వి నవ్వి ఒక్కో మాస్కు ఊడిపోతుందని.. సినిమా సగం అయ్యేసరికే మూడు మాస్కులు కావాలని.. ఇక రెండో సగంలో ఎమోషన్ వల్ల ఏడ్చి ఏడ్చి మాస్కులు తడిచిపోతాయని.. కాబట్టి మరో మూడు మాస్కులు అవసరమని విష్ణు అన్నాడు.
తాను సినిమా గురించి మరీ ఎక్కువేమీ చెప్పట్లేదని.. కావాలంటే తన గత సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో తన స్పీచ్‌లు చూసుకోవచ్చని.. సినిమా గురించి ఏమనిపిస్తే అదే చెబుతానని.. అవి తర్వాత నిజమే అయ్యాయని శ్రీవిష్ణు అన్నాడు. తాను వెంకటేష్‌కు వీరాభిమానినని.. ఆయన చిత్రం నారప్ప ఓటీటీలో వచ్చందని చాలా బాధపడ్డానని.. ఇప్పుడు తమ లాంటి చిన్న హీరోల సినిమాలు థియేటర్లలో బాగా ఆడి పెద్ద స్టార్ల సినిమాలన్నీ థియేటర్లలోనే వచ్చేలా ప్రేక్షకులు ఆశీర్వదించాలని విష్ణు కోరాడు.