90వ దశకంలోనే బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి లాంటి భారీ చిత్రాలకు కథలు అందించి గొప్ప పేరు సంపాదించిన రచయిత విజయేంద్ర ప్రసాద్. కానీ ఆయనకు అప్పట్లో రావాల్సినంత గుర్తింపు రాలేదు. కెరీర్లో చాలా ఏళ్లు ఆయన మరుగునే ఉండిపోయారు. ఐతే కొడుకు రాజమౌళి కారణంగా ఆయనకు లేటుగా అయినా రావాల్సిన గుర్తింపు వచ్చింది.
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోయింది. ఈ సినిమాతోనే ఆయనపై మీడియా దృష్టిపడింది. ఆయన తెర వెనుక నుంచి ముందుకొచ్చి మీడియాతో తరచుగా మాట్లాడుతున్నారు.
సందర్భం ఏదైనా.. ఎప్పుడు మాట్లాడినా.. ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతారాయన. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయేంద్ర ప్రసాద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. అందులో తన కొడుకు రాజమౌళితో తనకుండే ప్రొఫెషనల్, పర్సనల్ కనెక్షన్ గురించి చెప్పారు.
ప్రొఫెషనల్‌గా చూసుకుంటే.. రాజమౌళి ఒక దర్శకుడిగా, తాను ఒక కథకుడిలాగే మాట్లాడుకుంటామని.. తమ మధ్య వాదోపవాదాలు జరుగుతాయని ఆయన అన్నారు. కథా చర్చల్లో అయినా, మేకింగ్ టైంలో అయినా ఏదైనా మార్చమని చెబితే రాజమౌళి స్వీకరిస్తాడని.. తాను ఎడిట్ సూట్లో చూసి ఉన్నదున్నట్లు చెబుతానని, అప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి రాజమౌళి వెనుకంజ వేయడని విజయేంద్ర అన్నారు.
రాజమౌళి ఎప్పుడో ఒకసారి మాత్రమే తనను షూటింగ్‌కు పిలుస్తాడని, అతను పిలిస్తే తప్ప తాను వెళ్లనని విజయేంద్ర తెలిపారు. రాజమౌళి తీసిన ప్రతి సినిమానూ తాను ప్రివ్యూ థియేటర్లో ఒకసారి.. బయట థియేటర్లో ఒకసారి చూస్తానని ఆయన వెల్లడించారు.
కథకు సంబంధించిన పని నడుస్తున్నపుడు తామిద్దరం దాని గురించే మాట్లాడుకుంటామని.. ఆ పని అయిపోగానే తండ్రీ కొడుకులుగా మారిపోతామని.. ఏ ఆవకాయ బాగుంది.. ఏ కూర తినాలి అని మాట్లాడుకుంటామని.. రాజమౌళికి సైన్స్, వ్యవసాయం లాంటి అంశాలపై ఆసక్తి ఎక్కువ అని.. వాటి గురించి చర్చించుకుంటామని విజయేంద్ర చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates