బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎక్కువైనపుడు ఒకట్రెండు చిత్రాలు రేసు నుంచి తప్పుకోవడం మామూలే. ఐతే ఈ దిశగా నిర్ణయం తీసుకోవడానికి ఇగో అడ్డొస్తుంటుంది నిర్మాతలకు. తామెందుకు వెనక్కి తగ్గాలి.. వేరే వాళ్లు వెనక్కి వెళ్లొచ్చు కదా అన్న వాదన లేవనెత్తుతుంటారు. ఐతే అలా వెనక్కి తగ్గినంత మాత్రాన భయపడ్డేమీ కాదు. అది అందరికీ మంచి చేసే నిర్ణయమే అవుతుంది.
ఈ నెల చివరి వారానికి హడావుడిగా మూడు పేరున్న చిత్రాలకు రిలీజ్ డేట్లు ఇచ్చేశారు. అవే.. శ్రీదేవి సోడా సెంటర్, నూటొక్క జిల్లాల అందగాడు, ఇచట వాహనములు నిలుపరాదు. ఈ మూడు చిత్రాల మీదా ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది. వేటికవే విభిన్నమై కథాంశాలతో తెరకెక్కాయి. ఆయా చిత్రాలపై వాటి నిర్మాతల్లో బాగానే నమ్మకం కనిపిస్తోంది.
ఐతే థియేటర్లు ఈ మధ్యనే మొదలై ఇండస్ట్రీ పుంజుకుంటున్న సమయంలో ఇలా ఒకే వారం మూడు పేరున్న చిత్రాలు విడుదల కావడం అంత మంచిది కాదన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రిష్-దిల్ రాజు కలిసి నిర్మించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రాన్ని రేసులోంచి తప్పించారు. ఈ చిత్రాన్ని వారం లేటుగా సెప్టెంబరు 3న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు కొత్తగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఐతే ఈ విషయాన్ని మామూలుగా చెప్పకుండా హీరో అవసరాల శ్రీనివాస్ ముభావంగా ఉన్న స్టిల్ ఒకటి రిలీజ్ చేసి.. నూటొక్క జిల్లాల అందగాడు అలిగాడని, వారం లేటుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఫన్నీ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. పోటీ ఎక్కువవడంతో అనివార్య పరిస్థితుల్లోనే సినిమాను వాయిదా వేయాల్సి వచ్చినా.. ఆ విషయాన్ని సరదాగా చెప్పడం ద్వారా స్పోర్టివ్ స్పిరిట్ చూపించిన ఈ చిత్ర బృందాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.