కుర్రాడు మంచి ఛాన్స్ మిస్సయ్యాడు


బ్యాగ్రౌండ్ ఏమీ లేని.. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న కొత్త హీరో సినిమాకు క్రేజ్ రావడం.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడం.. రిలీజ్ రోజు హౌస్ ఫుల్స్ పడటం అరుదైన విషయం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ‘రాజా వారు రాణి వారు’ సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రెండో సినిమా ఇది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన రెండు మంచి పాటలు రిలీజ్ చేయడం.. యూత్‌కు నచ్చేలా టీజర్ కట్ చేయడం ద్వారా ఈ సినిమాకు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయింది.

గత ఏడాదే పూర్తయిన ఈ చిత్రం కోసం ఎప్పట్నుంచో జనాలు ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఓటీటీ ఆఫర్లు వచ్చినా కాదనుకుని.. థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ అయింది టీం. ఈ కాన్ఫిడెన్స్ చూసి ఈ సినిమా గట్టిగానే కొట్టబోతుందనే అభిప్రాయాలు కలిగాయి.

ఈ శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమాను రిలీజ్ చేశారు. మార్నింగ్ షోలు చాలా చోట్ల ఫుల్ అయ్యాయి. థియేటర్లలో మంచి సందడి కనిపించింది. ఐతే సినిమా ఆరంభంలో కనిపించిన ఊపు ముందుకు సాగే కొద్దీ లేకపోయింది. చాలా సాధారణమైన కథ.. బిగి లేని స్క్రీన్ ప్లే.. మామూలు సన్నివేశాలు సినిమా గ్రాఫ్‌ను తగ్గించేశాయి. ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ వర్కవుట్ అయినా.. ముందుకు సాగే కొద్దీ సినిమా నీరసం వచ్చేసింది ప్రేక్షకులకు. ప్రి క్లైమాక్స్‌లో తండ్రీ-కొడుకుల బంధం నేపథ్యంలో ఎమోషన్ పిండటానికి ప్రయత్నించారు కానీ అదంత వర్కవుట్ కాలేదు. ఓవరాల్‌గా సినిమా నిరాశకు గురి చేసింది. ఓ చిన్న సినిమాకు ఇంత క్రేజ్ వచ్చి కూడా దాన్ని అది ఉపయోగించుకోలేకపోయింది.

లాక్ డౌన్ బ్రేక్‌లో సినిమా చూసుకుని సర్దుబాట్లు చేసుకుని ఉంటే.. ఇంకొంచెం టైం తీసుకుని రీషూట్లు చేసుకుని ఉంటే.. ఎడిటింగ్ మీద శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకు స్పందన మరో రకంగా ఉండేది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి ఉంటే హీరో కిరణ్ దశ తిరిగిపోయేది. కొంత మేర స్టార్ ఇమేజ్ కూడా వచ్చేది. అతను మంచి ఛాన్స్ మిస్సయ్యాడనే చెప్పాలి.