తన పనితీరు గురించైనా, తన కొడుకు రాజమౌళి పనితనం గురించి అయినా అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంటారు లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్. దర్శకుడిగా తన వైఫల్యం గురించి చెబుతూ తనపై తాను కౌంటర్లు వేసుకోవడం ఆయనకే చెల్లింది. అలాగే కొడుకు గొప్పదనాన్ని చెబుతూనే.. అతడి లోపాల్ని సైతం ఎత్తి చూపిస్తారాయన.
రాజమౌళికి కథ రాసుకునే నైపుణ్యం లేదని.. అయితే మంచి కథను ఎంచుకుని దాన్ని అద్భుతమైన రీతిలో ప్రెజెంట్ చేయడంలో మాత్రం దిట్ట అని గతంలోనే ఆయన చెప్పారు. అలాగే రాజమౌళి విషయంలో విజయేంద్రకు మరో కంప్లైంట్ కూడా ఉంది.
సినిమాల మేకింగ్‌లో అతను చాలా స్లో అని, ఎన్నోసార్లు ఈ బలహీనతను సరిదిద్దుకోమని చెప్పి చెప్పి అలసిపోయానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. రాజమౌళితో పాటు ప్రస్తుత టాలీవుడ్ డైరెక్టర్లయిన త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, పూరి జగన్నాథ్‌ల పనితనం గురించి కూడా ఆయన ఇందులో మాట్లాడారు.
పనితీరు పరంగా రాజమౌళి, సుకుమార్‌ల తీరు ఒకటే అని విజయేంద్ర అభిప్రాయపడ్డారు. తన కొడుకు లాగే సుకుమార్ కూడా చాలా స్లోగా సినిమాలు తీస్తాడని ఆయన అన్నారు. ఐతే సినిమా పట్ల ప్యాషన్, ప్రెజెంటేషన్ విషయంలో ఇద్దరికీ తిరుగులేదని ఆయనన్నారు.
పూరి జగన్నాథ్ తన అభిమాన దర్శకుడని చెప్పిన విజయేంద్ర.. టాలీవుడ్ స్టార్డ డైరెక్టర్లందరిలోకి చాలా స్పీడుగా సినిమాలు తీస్తాడని.. ఆయనో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అని, ఇది ఆయనలో తనకు నచ్చే లక్షణమని విజయేంద్ర అన్నారు.
పూరి ఫైట్స్ చాలా బాగా తీస్తారని.. చాలా చిన్న సన్నివేశంతోనే ఫైట్‌కు లీడ్ ఇవ్వగలరని.. ఇప్పుడు హీరో కొడితే బాగుండు అని ప్రేక్షకుడితో అనిపించి ఆ తర్వాత ఫైట్ తీసుకొస్తారని.. వాటిని కంపోజ్ చేసే తీరు కూడా చాలా బాగుంటుందని ఆయన కితాబిచ్చారు. త్రివిక్రమ్ కూడా తనకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరని.. ఆయన హ్యూమర్‌ను తాను చాలా ఎంజాయ్ చేస్తానని విజయేంద్ర అన్నారు.