సంక్రాంతికి బ్యాండ్ ఎవరికో?


వచ్చే సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోయానని అనుకుంటుంటే.. ఉన్నట్లుండి ఇప్పుడు ‘రాధేశ్యామ్’ లైన్లోకి వచ్చింది. ఇప్పటికే సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్-రానాల మూవీ సంక్రాంతికి విడుదల ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. వీలును బట్టి ‘ఎఫ్-3’ని కూడా రేసులోకి నిలపాలనుకుంటున్నారు. కానీ అనూహ్యంగా ‘రాధేశ్యామ్’ సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఏకంగా జనవరి 14న అంటూ రిలీజ్ డేట్ సైతం ఇచ్చేశారు.

జులై 30న రావాల్సిన సినిమాకు కరోనా బ్రేక్ వేస్తే.. దసరానో దీపావళినో టార్గెట్ చేస్తారులే అనుకుంటే.. ఊహించని విధంగా సంక్రాంతి రేసులోకి వచ్చిందీ చిత్రం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్ల సినిమాలు ఒకే పండక్కి రావడమే అరుదైన విషయం. అక్కడికే బాక్సాఫీస్ కావాల్సినంత హీటెక్కిపోతుంది. అలాంటిది ‘బాహుబలి’ తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా మారిన ప్రభాస్ కూడా రేసులో నిలిస్తే ఇక బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టం.

ఐతే ఇలా ముగ్గురు సూపర్ స్టార్లు ఒకేసారి పోటీ పడటం కరెక్టేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది ఇప్పుడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ‌పుర‌ములో లాంటి రెండు భారీ చిత్రాల‌ను రిలీజ్ చేస్తేనే వాటికి థియేట‌ర్లు స‌ర్దుబాటు చేయ‌డం క‌ష్ట‌మైంది. రెంటికీ పాజిటివ్ టాక్ రాబ‌ట్టి, టికెట్ల రేట్లు పెంచ‌బ‌ట్టి స‌రిపోయింది కానీ.. లేదంటే ఇలా రెండు భారీ చిత్రాలు రిలీజైన‌పుడు ఒక‌దానికి పాజిటివ్ టాక్ వ‌చ్చి, ఇంకోదానికి నెగెటివ్ టాక్ వ‌స్తే అది అన్యాయం అయిపోతుంది. అందులోనూ వ‌చ్చే సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు రేసులోకి వ‌స్తున్నాయి. ఫ్యామిలీస్, మెజారిటీ ఆడియ‌న్స్ మూడు సినిమాలూ చూడరు. అందులో బాగున్న ఒక‌టో రెండో సినిమాలు చూస్తారు.

ఒక‌వేళ పై మూడు చిత్రాల్లో ఏదైనా ఒక సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చిందంటే అంతే సంగ‌తులు. ఓపెనింగ్స్ కూడా ఉండ‌వు. దారుణ‌మైన దెబ్బ ప‌డుతుంది. సంక్రాంతి రేసులో ఉన్న మూడూ భారీ బ‌డ్జెట్ చిత్రాలే. వాటిపై భారీగా పెట్టుబ‌డి పెట్టి రిస్క్ చేస్తున్నారు. అలాంట‌పుడు ఏదైనా తేడా జ‌రిగితే అంతే సంగ‌తులు. బ్యాండ్ మామూలుగా ఉండ‌దు.