సౌత్ ఇండియాలో హీరోలతో సమానంగా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన అరుదైన కథానాయికల్లో నయనతార ఒకరు. మొదట్లో అందరు తారల్లాగే గ్లామర్ కనిపించినా.. ఆ తర్వాత విలక్షణమైన పాత్రలు, అద్భుతమైన నటనతో ఆమె తన ఇమేజ్‌ను మార్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ విజయాలందుకుంది. మాయ, అరామ్, కోలమావు కోకిల లాంటి చిత్రాలు ఆమె సత్తాను చాటి చెప్పాయి.
ఇప్పుడు నయనతార నుంచి రానున్న మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘నేత్రికన్’. ఇందులో నయన్ అంధురాలి పాత్రను పోషించడం విశేషం. ఇంతకుముందు సిద్దార్థ్ హీరోగా ‘అవల్’ (తెలుగులో గృహం) చిత్రంతో దర్శకుడిగా ఆకట్టుకున్న మిలింద్ రావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించడమే కాక అన్ని పాటలూ తనే రాశాడు. త్వరలోనే హాట్ స్టార్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
ఒక సిటీలో అమ్మాయిలను చెరబట్టి వారిని దారుణంగా హింసించి చంపే సైకో కిల్లర్ గురించి చిన్న క్లూ కూడా దొరక్క పోలీసులు అవస్థలు పడుతుంటే.. ఆ హత్యలు చేస్తోంది ఒక క్యాబ్ డ్రైవర్ అని గుర్తించి, తన పరిశీలనా శక్తితో అతడి పని పట్టే అంధురాలిగా నయన్ కనిపించనుంది ఈ చిత్రంలో. ట్రైలర్లో ప్రతి షాట్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పోలీసులకు సవాలు విసురుతున్న సైకో కిల్లర్‌ను ఒక అంధురాలు సవాలు చేసి అతడి మీద పైచేయి సాధించడం అనే కాన్సెప్ట్ ఆసక్తి రేకెత్తించేదే.
ఇందులో సైకో కిల్లర్‌గా ‘రంగం’ ఫేమ్ అజ్మల్ నటించడం విశేషం. అతడితో నయన్ ఫేసాఫే సినిమాకు ఆకర్షణగా కనిపిస్తోంది. ట్రైలర్లో ఆద్యంతం గిరీష్ గోపాలకృష్ణన్ నేపథ్యం సంగీతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ చిత్రాన్ని ఆగస్టు రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. తెలుగులో కూడా అందుబాటులో ఉండే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates