తండ్రి రూట్లోకి వచ్చాడు.. హిట్టొస్తుందా?

టాలీవుడ్ అంతా వార‌సుల‌తో నిండిపోయి ఉందిప్పుడు. టాలీవుడ్ యువ క‌థానాయ‌కుల్లో మంచి స్థాయిలో ఉన్న వాళ్లలో చాలామంది వార‌సులే. ఆ జాబితాలోకి త‌న కొడుకు కూడా చేర‌తాడ‌ని ఆశించారు సీనియ‌ర్ నటుడు సాయికుమార్. కానీ ఆయ‌న ఆశ ఫ‌లించ‌లేదు.

సాయికుమార్ త‌న‌యుడు ఆది.. హీరోగా అరంగేట్రం చేసి ప‌దేళ్లు కావ‌స్తోంది. ఇంకా అత‌ను నిల‌దొక్కుకోలేదు. ఆరంభంలో ఓ మోస్త‌రు విజ‌యాలు ద‌క్కాయి. వాటిని మించిన హిట్లు కోసం చూస్తే అస‌లుకే మోసం వ‌చ్చింది. మొద‌ట్లో చేసిన ప్రేమ‌కావాలి, ల‌వ్లీ లాంటి సినిమాలే న‌య‌మ‌న్న‌ట్లు త‌యారైంది ప‌రిస్థితి. గ‌త ఐదారేళ్ల‌లో వ‌రుస‌బెట్టి డిజాస్ట‌ర్లు ఇచ్చాడు ఆది. దీంతో అత‌డి మార్కెట్ జీరో అయిపోయింది.

ఐతే సాయికుమార్‌కు ఉన్న పరిచ‌యాలు, ప‌లుకుబ‌డి వ‌ల్లో.. మంచి పేరు వ‌ల్లో ఆదికి ఇంకా అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. అత‌ను హీరోగా శ‌శి పేరుతో ఓ ఇంటెన్స్ ల‌వ్ స్టోరీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆది క‌థానాయ‌కుడిగా బ్లాక్ పేరుతో కొత్త చిత్రం అనౌన్స్ చేశారు. కృష్ణ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆది పోలీస్ పాత్ర చేస్తున్నాడు.

ఆది తండ్రి సాయికుమార్‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా పోలీస్ స్టోరీ. ఆ త‌ర్వాత వ‌రుస‌గా పోలీస్ క‌థ‌లే చేశాడు. ఆ పాత్ర‌ల‌తోనే మంచి స్థాయిని అందుకున్నాడు. ఆది ఇన్నేళ్ల త‌ర్వాత తండ్రి రూట్లోకి వ‌చ్చి పోలీస్ పాత్ర చేస్తున్నాడు. బ్లాక్‌లో అత‌ను యారొగెంట్ పోలీస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. మ‌రి తండ్రి బాట‌లోకి వ‌చ్చాక అయినా అత‌డికి హిట్టొచ్చి కెరీర్ బాగుప‌డుతుందేమో చూడాలి.