ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఏఆర్ రెహ్మాన్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహ్మాన్ ఎవరో తనకు తెలియదని బాలయ్య చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఏఆర్ రెహ్మాన్ కు ఆస్కార్ అవార్డు వచ్చినా.. ఆయనెవరో తనకు తెలియదని అన్నారు బాలయ్య.
”ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్ అందిస్తాడు.. ఆస్కార్ అవార్డ్ అంటారు.. అవన్నీ నేను పట్టించుకోను” అంటూ ఏఆర్ రెహ్మాన్ ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే 1993లో బాలయ్య నటించిన ‘నిప్పురవ్వ’ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం గమనార్హం. సినిమాకి మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయనే అందించారు.
ఇదే ఇంటర్వ్యూలో బాలయ్య అవార్డుల గురించి కూడా మాట్లాడారు. భారతరత్న అవార్డు తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోరు, కాలి చెప్పుతో సమానమని అన్నారు. అవార్డు ఇచ్చిన వాళ్లకు గౌరవం కానీ ఆయనకు గౌరవం ఏంటి..? అంటూ ప్రశ్నించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి తన కుటుంబం చేసిన కృషికి ఏ అవార్డు కూడా సరిపోదని అన్నారు. ఎన్టీఆర్ భారతరత్న కంటే గొప్పోడు అంటూ చెప్పుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు బ్యానర్లలో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates