కాజల్, రెజీనా.. ఓ మల్టీస్టారర్

కెరీర్లో చాలా లేటుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల మీద దృష్టిపెట్టింది కాజల్ అగర్వాల్. రెండేళ్ల కిందట తేజ దర్శకత్వంలో ఆమె ‘సీత’ అనే హీరోయిన్ ప్రధాన సినిమా చేసిన సంగతి తెలిసిందే. కానీ అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మరోవైపు బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ తమిళ రీమేక్‌లోనూ కాజల్ లీడ్ రోల్ చేసింది. కానీ ఆ సినిమా విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది.

ఐతే కాజల్ కొంచెం బ్రేక్ తీసుకుని ఇప్పుడు మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే అందులో లీడ్ రోల్ చేస్తున్నది కాజల్ మాత్రమే కాదు. ఇంకో ముగ్గురు హీరోయిన్లు కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అంటే ఇది లేడీ మల్టీస్టారర్ అన్నమాట.

ఇందులో మరో స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా నటిస్తోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కడి హీరోయిన్ జనని మరో లీడ్ రోల్ చేసింది. ఇంకో కొత్తమ్మాయి కూడా నటించింది.

ఈ చిత్రానికి ‘కరుంగాపియం’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీని ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. లీడ్ రోల్స్ చేస్తున్న నలుగురు అమ్మాయి ముఖాలను సైడ్ నుంచి వరుస క్రమంలో చూపించారు. అందరిలోకి ఎక్కువ ఆకర్షిస్తున్నది కాజలే. ఎందుకంటే ఆమె తన శైలికి భిన్నంగా పక్కా ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తోంది.

చీర, పెద్ద బొట్టులో సంప్రదాయ మహిళగా కాజల్ కొత్తగా కనిపిస్తోంది. సినిమాలో అందరికంటే ఆమెదే కీలక పాత్ర అని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఇంతకుముందు కాజల్, జీవా జంటగా ‘కవలై వేండాం’ అనే లవ్ స్టోరీ తీసిన డీకే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

కమెడియన్ యోగిబాబుతో పాటు ‘కబాలి’ ఫేమ్ కలైయరసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాజల్, రెజీనా టాలీవుడ్లో బాగా పాపులర్ కాబట్టి ఈ చిత్రాన్ని ఆటోమేటిగ్గా తెలుగులోనూ రిలీజ్ చేస్తారన్నమాటే. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.