హిట్ సెకండ్ కేస్ రెడీ

ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ప్రామిసింగ్ డెబ్యూ అనిపించిన దర్శకుల్లో శైలేష్ కొలను ఒకడు. వైద్యుడు, శాస్త్రవేత్త అయిన అతను.. సినిమా పిచ్చితో అన్నీ వదులుకుని ఇటు వచ్చేశాడు. మంచి నటుడే కాక అభిరుచి ఉన్న నిర్మాత అయిన నేచురల్ స్టార్ నానిని మెప్పించి, ఒప్పించి ‘హిట్: ది ఫస్ట్ కేస్’ పేరుతో సినిమా తీసేశాడు.

విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 28న విడుదలై మంచి విజయమే సాధించింది. థియేటర్లలో అన్ సీజన్లో రిలీజ్ కావడం వల్ల ఆ సినిమాకు వసూళ్లు తగ్గాయి కానీ.. లేదంటే ఇంకా బాగా ఆడేది. ఆ తర్వాత అమేజాన్ ప్రైంలోకి వచ్చిన ఈ చిత్రం ఇక్కడ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్నది అందరూ అంచనా వేస్తున్న విషయమే. సినిమా చివర్లో కూడా అందుకు సంకేతాలు ఇచ్చారు.

ఐతే ‘హిట్-2’కు ఎప్పుడు సన్నాహాలు జరుగుతాయి.. విశ్వక్సేనే హీరోగా నటిస్తాడా.. నానీనే నిర్మిస్తాడా అనే విషయాలపై స్పష్టత లేదు. శైలేష్ మధ్యలో వేరే సినిమా ఒకటి చేసి ఆ తర్వాత ‘హిట్-2’ మీద దృష్టిసారిస్తాడని వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో కానీ.. లాక్ డౌన్ టైంలో శైలేష్ మాత్రం ఖాళీగా ఉండకుండా ‘హిట్-2’ మీదే ఫోకస్ పెట్టాడు.

ఆ సినిమాకు స్క్రిప్టు దాదాపుగా పూర్తి చేసేశాడు. తాను లాక్ డౌన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నానో చూపిస్తూ అతను ట్విట్టర్లో చిన్న వీడియో పోస్ట్ చేశాడు. అందులో హిట్-2 స్క్రిప్ట్ ఫైల్‌ను చూపించాడు.

ఆ ఫైల్ సైజ్ చూస్తే కథ దాదాపుగా రెడీ అయినట్లే కనిపిస్తోంది. ఈ స్క్రిప్టును ఆస్ట్రేలియా రైటర్స్ గైడ్‌లో రిజిస్టర్ చేయించినట్లు కూడా ఫైల్ మీద నోట్ ఉండటం విశేషం. ఆల్రెడీ రిజిస్ట్రేషన్‌కు కూడా వెళ్లిపోయిందంటే ఇక సినిమా మొదలుపెట్టడమే తరువాయి అన్నమాట. మరి ‘హిట్-2’కు కూడా సేమ్ టీం పని చేస్తుందో లేదో చూడాలి.