తెలుగులో మన స్టార్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సూర్య ఓ దశలో. అతడి మార్కెట్ రూ.20 కోట్ల దాకా కూడా వెళ్లింది ఒకానొక టైంలో. కానీ దాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. అయినప్పటికీ సూర్య మీద ఇంకా మన ప్రేక్షకుల్లో అభిమానం నిలిచి ఉంది. మన తెలుగమ్మాయే డైరెక్ట్ చేసిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ కావాలని అతను చూస్తున్నాడు.
ఈ చిత్ర టీజర్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. లాక్ డౌన్ లేకుంటే ఈ వేసవిలోనే ఆ చిత్రం విడుదల కావాల్సింది. మళ్లీ థియేటర్లు తెరుచుకుని, జనాలు మామూలుగా థియేటర్లకు వచ్చే సమయానికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఖాళీ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేసేయాలని చూస్తున్నారు. తెలుగు డబ్బింగ్ పనులు కూడా నడుస్తున్నాయి.
‘ఆకాశమే నీ హద్దురా’కు సంబంధించి పెద్ద విశేషం ఏంటంటే.. ఇందులో సూర్య పాత్రకు ఓ ప్రముఖ తెలుగు నటుడు డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అతనెవరో కాదు.. సత్యదేవ్. నటుడిగా మంచి స్థాయిలోనే ఉన్న అతను సూర్యకు డబ్బింగ్ చెప్పడానికి అంగీకరించాడు. ఇంతకుముందు నాని ఇలాగే ‘ఓకే బంగారం’లో దుల్కర్ సల్మాన్‌కు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. సూర్యకు గతంలో శ్రీనివాసమూర్తి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ ఇచ్చేవాడు.
తర్వాత కొన్ని సినిమాల నుంచి సూర్యనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ‘ఆకాశమే..’ విషయంలో ఎందుకు తన వాయిస్ వద్దనుకున్నాడో తెలియదు మరి. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఇంతకుముందు ‘గురు’ చిత్రాన్ని రూపొందించిన సుధ కొంగర ఈ సినిమాను డైరెక్ట్ చేసింది.