భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకడు. హిందీలో అతను చేసిన చిత్రాలతో ఎంత గొప్ప పేరు సంపాదించాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ పేరుతోనే హాలీవుడ్లో లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్ లాంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు దక్కించుకున్నాడు. వాటితోనూ సత్తా చాటాడు. కానీ ఈ లెజెండరీ నటుడు గత ఏడాది అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కొన్నేళ్ల కిందట అరుదైన క్యాన్సర్ బారిన పడి.. దాంతో పోరాడిన ఇర్ఫాన్ నిరుడు కొవిడ్ టైంలో తనువు చాలించాడు.
అనారోగ్యం పాలయ్యాక మధ్యలో ఆగిపోయిన అంగ్రేజీ మీడియంను పూర్తి చేశాడు కానీ.. అతను అంగీకారం తెలిపిన వేరే సినిమాలకు ప్రత్యామ్నాయాలు చూసుకోక తప్పలేదు. అందులో ఒకటి.. టికు వెడ్స్ షేరు. కంగనా రనౌత్ సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో మొదలు కావాల్సిన తొలి చిత్రమిది.
ఈ సినిమాను ప్రకటించాక ఇర్పాన్ అనారోగ్యం బారిన పడటంతో దీన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఇర్ఫాన్ కోలుకుని ఈ సినిమా చేస్తాడని అనుకున్నారు కానీ.. అది జరగలేదు. దీంతో మరింత టైం తీసుకుని ఎట్టకేలకు ఈ సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. ఇర్ఫాన్ తర్వాత అంత గొప్ప నటుడిగా పేరు సంపాదించిన మరో లెజెండరీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి ఈ చిత్రంలో నటించనున్నాడు. ఇర్ఫాన్‌కు ఇంతకంటే మంచి రీప్లేస్మెంట్ మరొకటి ఉండదనడంలో సందేహం లేదు.
టైటిల్లో షేరు అన్న పదం నవాజ్‌ను సూచించేదే. వెల్కమ్ టు అవర్ లయన్ అంటూ తమ ప్రాజెక్టులోకి నవాజ్‌కు కంగనా ఆహ్వానం పలికింది. ఈ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహిస్తుందని.. లేదా ఆమె దర్శకత్వ పర్యవేక్షణలో మరో డైరెక్టర్ ఈ సినిమా తీస్తారని అంటున్నారు. మణికర్ణిక చిత్రాన్ని క్రిష్ పూర్తి చేశాక.. కంగనా స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకుని రీషూట్లు చేయడం తెలిసిందే.