అట్టకత్తి, మద్రాస్ లాంటి వైవిధ్యమైన సినిమాలతో తమిళంలో దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన దర్శకుడు పా.రంజిత్. ఈ రెండు చిత్రాలతో అతను సూపర్ స్టార్ రజినీకాంత్ దృష్టిని ఆకర్షించాడు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కబాలి’ చుట్టూ విడుదలకు ముందు ఎంత హైప్ నెలకొందో తెలిసిందే.
కానీ ఆ హైప్‌కు తగ్గట్లు సినిమా లేకపోయింది. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ రజినీ.. మళ్లీ రంజిత్‌తో కలిసి ‘కాలా’ చేశాడు. ఇది కూడా అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమా తర్వాత రంజిత్ చాలా గ్యాప్ తీసుకుని ఆర్య హీరోగా ‘సర్పాట్ట: పరంపరై’ అనే సినిమా తీశాడు.
ఈ చిత్రం ఈ నెల 22న అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. ‘సర్పాట్ట’ బాక్సింగ్ చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ స్టోరీ. బాక్సర్‌గా ఆర్య పెర్ఫామెన్స్ సినిమాలో మేజర్ హైలైట్ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
బ్రిటిష్ కాలంలో వాళ్ల దగ్గర పని చేసే తమిళ వ్యక్తులు బాక్సింగ్ నేర్చుకుని.. తర్వాత బ్రిటిష్ వారితోనే పోటీ పడి గెలవడం.. ఆ తర్వాత ఈ బాక్సింగ్ ఆ వర్గంలో ఒక సంస్కృతిగా మారడం.. ఆపై వారిలో వారికే వర్గాలు రావడం.. గొడవలు పడటం.. ఈ నేపథ్యంలో ‘సర్పాట్ట’ నడుస్తుంది. ఐతే ఓ వర్గానికి చెందిన బాక్సర్ ఆధిపత్యంతో.. మరో వర్గం అవమానానికి గురి కావడం.. ఆ బాక్సర్‌ను ఓడించే యోధుడు ఎవరూ లేక ఈ వర్గం వేదనకు గురి కావడం.. ఆ సమయంలో హీరో అతణ్ని తాను ఓడిస్తానని రంగంలోకి దిగడం.. కానీ అతడి వర్గం నుంచే అవమానాలు ఎదురు కావడం.. చివరికి అన్ని అవమానాలనూ దిగమింగి, అన్ని అడ్డంకులనూ అధిగమించి హీరో.. సదరు బాక్సర్‌తో తలపడి గెలవడం.. ఇదీ స్థూలంగా కథ.
కొన్ని దశాబ్దాల కిందటి నేపథ్యాన్ని పా.రంజిత్ చాలా చక్కగా చూపించాడు. ఎమోషన్లు సినిమాకు అతి పెద్ద బలంగా కనిపిస్తున్నాయి. గత సినిమాల్లో మాదిరి సామాజిక అంశాల మీద మరీ డీప్‌గా వెళ్లకుండా కమర్షియల్ స్టయిల్లోనే సినిమా తీసినట్లున్నాడు రంజిత్. ‘సర్పాట్ట’ తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుండటం విశేషం.