తమిళంలో పా.రంజిత్ అనే దర్శకుడి శైలే వేరు. అతడి కథలన్నీ సామాజిక అంశాల చుట్టూనే తిరుగుతాయి. ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాలపై అగ్ర వర్ణాల అఘాయిత్యాల చుట్టూ అతను తన కథల్ని నడుపుతాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన అతను.. తన అనుభవాల సారాన్నంతా తన సినిమాల్లో చూపిస్తాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేసిన రెండు సినిమాల్లో కూడా అతను అదే ప్రయత్నం చేశాడు. రజనీ సినిమాలు కదా అని కమర్షియల్ హంగుల కోసం రాజీ పడలేదు. ‘కబాలి’తో పాటు ‘కాలా’లోనూ హీరోను దళితుడిగా చూపించి.. ఆ వర్గం సమస్యల్ని ఎలివేట్ చేస్తూ, తన ఐడియాలజీనంతా ఆ సినిమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. సమాజానికి బలమైన సందేశం ఇవ్వడానికి చూశాడు. రంజిత్ నిర్మించిన ‘పరియేరుం పెరుమాల్’ సినిమా సైతం అతడి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లాగే ఉంటుంది.
ఐతే తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు చాలా తక్కువ. ఈ మధ్య అయితే మరీ తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో ‘పలాస 1978’ అనే సినిమాతో కొత్త దర్శకుడు కరుణ్ కుమార్ దళితుల సమస్యల్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. రాంగ్ టైం రిలీజ్ వల్ల ఈ చిత్రం థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ.. ఈ మధ్యే అమేజాన్ ప్రైంలో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు రంజిత్ దృష్టిలో పడింది.
దీనిపై ప్రశంసలు కురిపిస్తూ అతను ట్వీట్ చేశాడు. తెలుగు సినిమా పరిశ్రమలో ‘పలాస 1978’ ఓ ముఖ్యమైన చిత్రం అని.. దళితుల కోణంలో చాలా నిజాయితీగా, వాస్తవికంగా ఈ సినిమాను తీర్చిదిద్దారని.. ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నానని రంజిత్ ట్వీట్ చేశాడు.
దర్శకుడు కరుణ్ కుమార్‌ను కూడా అతను అభినందించాడు. ఇంతవరకు తెలుగు సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడని రంజిత్.. తన లాగే దళితుల సమస్యల్ని చర్చిస్తూ కరుణ్ సినిమా తీసిన నేపథ్యంలో ఇలా ప్రశంసలు కురిపించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates