శనివారం సినిమా వాళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో రెండు వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఒకటి ఆమిర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకోవడం. ఇంకోటి మెహ్రీన్ పిర్జాదా తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం. ఆమిర్ ఖాన్ విడాకులకు దారితీసిన పరిస్థితులపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆమిర్ విడాకులు తీసుకోవడం కంటే కూడా మెహ్రీన్ నిశ్చితార్థం రద్దు చేసుకోవడమే ఎక్కువ సంచలనం రేపుతోంది.
అసలు కెరీర్లో మంచి స్థితిల ఉండగా మెహ్రీన్ పెళ్లికి సిద్ధం కావడమే ఆశ్చర్యం అనుకుంటే.. ఒక పెళ్లి స్థాయిలో గత ఏడాది ఘనంగా నిశ్చితార్థం చేసుకుని భారీ స్థాయిలో ఫొటో షూట్లు కూడా చేసుకుని కొన్ని ఫొటోలను మీడియాకు కూడా రిలీజ్ చేసిన మెహ్రీన్.. ఇప్పుడిలా భవ్య బిష్ణోయ్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం అనూహ్యం. అసలు కరోనా లేకుంటే ఈపాటికే వీరి పెళ్లి కూడా అయిపోయేదేమో.
కాగా భవ్యతో మెహ్రీన్ విడిపోవడానికి కారణం ఆమెకు సినిమాలపై ఉన్న ప్రేమే అని తెలుస్తోంది. భవ్య బిష్ణోయ్‌ది పేరున్న పొలిటికల్ ఫ్యామిలీ. పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాలు చేయడం వారికి ఇష్టం లేదట. ఈ విషయంపై ముందుగా ఏమీ అనుకోకున్నప్పటికీ.. నిశ్చితార్థం తర్వాత మెహ్రీన్ మళ్లీ సినిమాల పట్ల ఆసక్తి చూపించడం, చేతిలో ఉన్న సినిమాలకు తోడు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవడం పట్ల భవ్య, అతడి కుటుంబంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని.. ఇన్నాళ్లూ స్వేచ్ఛగా సినిమాలు చేసుకున్న తాను ఇకపై ఈ పెద్ద కుటుంబంలోకి వెళ్లి సినిమాలకు దూరం కావడం ఇష్టం లేకే తనకిది సరిపడదని భవ్యతో నిశ్చితార్థాన్ని ఆమె రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల ఆలోచన తర్వాత ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్-2తో పాటు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో సంతోష్ శోభన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది మెహ్రీన్.