‘మేజర్’పై అంత నమ్మకమా!

అడివి శేష్ అనే పేరుకు గత కొన్నేళ్లలో ఎంతగా విలువ పెరిగిందో తెలిసిందే. అతడి సినిమా అంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చనే నమ్మకం చాలామంది ప్రేక్షకుల్లో ఉంది. కేవలం నటుడిగానే కాక.. రచయితగా అతను తెచ్చుకున్న గుర్తింపు అలాంటిది. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో అడివి శేష్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడతడి నుంచి రానున్న ‘మేజర్’పై భారీ అంచనాలే ఉన్నాయి.

ముంబయిలో తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి జరిపినపుడు అక్కడ వీరోచితంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి.. వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎప్పట్లాగే అడివి శేష్ ఈ చిత్రానికి కూడా రచనా సహకారం అందించాడు. ఆ మధ్య రిలీజైన ‘మేజర్’ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

‘మేజర్’పై తెలుగులో మంచి అంచనాలుండటంలో ఆశ్చర్యం లేదు. కానీ హిందీలో కూడా ఈ సినిమాపై బాగానే భరోసా ఉందని అర్థమవుతోంది. ‘మేజర్’ హిందీ శాటిలైట్ హక్కులను రూ.10 కోట్లకు కొనుగోలు చేయడమే ఇందుకు రుజువు. క్షణం, గూఢచారి చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్లతో శేష్‌కు ఉత్తరాదిన మంచి ఫాలోయింగే వచ్చింది. అక్కడ అతడికి మార్కెట్ ఏర్పడింది. శేష్‌కు ఉన్న పేరుకు తోడు సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ అనగానే అక్కడి ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. దీని టీజర్ ఉత్తరాదిన కూడా బాగా ట్రెండ్ అయింది.

ఈ నేపథ్యంలోనే ‘మేజర్’ హిందీ శాటిలైట్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడినట్లుంది. తెలుగు శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటే పలికినట్లు తెలుస్తోంది. ఆ ఫిగర్ ఎంతో బయటికి రాలేదు. దీని డిజిటల్ హక్కులకు కూడా మంచి డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ రోజే (జులై 2) ‘మేజర్’ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సింది. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.