గత ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా ‘ఆహా’ పేరుతో ఓటీటీ మొదలుపెట్టి ఆశ్చర్యానికి గురి చేశారు అల్లు అరవింద్. ఓటీటీ అంటే చాలా పెద్ద వ్యవహారం అని.. వందల కోట్లు చేతిలో పెట్టుకుని రంగంలోకి దిగాల్సిందే అని.. ప్రాంతీయ భాషలో పరిమిత బడ్జెట్లో ఓటీటీని మొదలుపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని అంతా అనుకున్నారు. ఐతే ఏం చేసినా పక్కా ప్రణాళికలతో, దూర దృష్టితో చేసే అరవింద్.. ఓటీటీ విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
సొంతంగా నిర్మించిన సినిమాలకు తోడు.. కొత్తగా కొన్ని చిన్న సినిమాలను కొనుగోలు చేసి చిన్న స్థాయిలోనే ‘ఆహా’ను మొదలుపెట్టి.. ఆ తర్వాత నెమ్మదిగా కంటెంట్ పెంచుతూ పోయారు. ముందు ఆహాను లైట్ తీసుకున్న వాళ్లు కూడా ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకునే పరిస్థితి కల్పించారు. తెలుగు కంటెంట్‌కు తోడు ఇతర భాషల చిత్రాలను తక్కువకు కొనుగోలు చేసి డబ్ చేసి రిలీజ్ చేయడం ద్వారా ‘ఆహా’ కోసం పెట్టే డబ్బులు గిట్టుబాటయ్యేలా చూశారు.
ఈ మధ్యన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల సంఖ్య కూడా బాగా పెరిగింది ఆహాలో. కొత్త కంటెంట్‌కు తోడు పాత క్లాసిక్స్‌ను కూడా ఎప్పటికప్పుడు ఆహాలోకి తెస్తోంది దాని టీం. తాజాగా ఆహాలోకి రాబోతున్న 14 చిత్రాలను ప్రకటించారు. అవేమీ కొత్త సినిమాలు కాదు. పాతవే. కానీ అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే క్లాసిక్స్ ఉన్నాయి. భైరవద్వీపం, చిరునవ్వుతో, రాజేంద్రుడు గజేంద్రుడు, వినోదం, ఈగ, బంగారు బుల్లోడు, ఊహలు గుసగుసలాడే, కొబ్బరి బొండాం, ఘటోత్కచుడు, అందాల రాక్షసి, దిక్కులు చూడకు రామయ్యా లాంటి మంచి సినిమాలున్నాయి అందులో. ఇవి కాక యుద్ధం శరణం, వేటగాడు, లీసా, లాంటి సినిమాలు కూడా ఆహాలోకి రానున్నాయి. ఓవైపు కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు పెద్ద ఎత్తున తీసుకొస్తూ.. ఇలా పాత క్లాసిక్స్‌ను జోడించడం ద్వారా ఉన్న సబ్స్క్రైబర్లను నిలబెట్టుకోవడంతో పాటు కొత్త వాళ్లను కూడా బాగానే ఆకర్షిస్తోంది ఆహా.