అఖిల్ తో మైత్రి ప్లాన్ ఇదే!

స్టార్ కిడ్ అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. అందులో ఏదీ కూడా అఖిల్ కి భారీ సక్సెస్ ను తీసుకురాలేదు. దీంతో తన సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ వినిపించిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది.

పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. అనీల్ సుముఖ నిర్మిస్తోన్న ఈ సినిమా జూలైలో షూటింగ్ జరుపుకోనుంది. అయితే ఇప్పుడు అఖిల్ మరో సినిమా ఒప్పుకున్నాడని సమాచారం. టాలీవుడ్ హీరోలతో వరుస ప్రాజెక్ట్ లను చేపడుతున్న మైత్రి మూవీస్ సంస్థ గతంలో అఖిల్ కి భారీ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసింది.

ఇప్పుడు ఈ సినిమాకి దర్శకుడిగా శ్రీనువైట్ల వ్యవహరించబోతున్నారని సమాచారం. అఖిల్ కి సరిపడా రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసుకున్న శ్రీనువైట్ల మైత్రి సంస్థకు తన స్క్రిప్ట్ ను వినిపించాడు. త్వరలోనే అఖిల్ ని కలిసి నేరేషన్ ఇస్తారట. అఖిల్ కి కూడా కథ నచ్చితే వచ్చే ఏడాదిలో ఈ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుంది. ప్రస్తుతం శ్రీనువైట్ల ‘ఢీ అండ్ ఢీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు.