రూ.150 కోట్లతో ధనుష్ కొత్తిల్లు!

తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాదిలో చెన్నైలోని పోయిస్ గార్డెన్ ప్రాంతంలో కొత్తింటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి రజినీకాంత్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఈ ఇంటి కోసం ధనుష్ ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయం బయటకొచ్చింది. దాదాపు 19000 చదరపు గజాల్లో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోంది. నాలుగు అంతస్తులుగా నిర్మిస్తోన్న ఈ భావన కోసం ధనుష్ రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

ఈ ఇంట్లోని గదులను ధనుష్ తనకు నచ్చినట్లుగా స్పెషల్ డిజైన్ చేయిస్తున్నారట. ఇంటీరియర్ డెకరేషన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ ఇంటికి దగ్గరలోలోనే ఈ ఇల్లు ఉండడం విశేషం. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో ‘గ్రే మ్యాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే అమెరికా వెళ్లాడు ధనుష్. తిరిగొచ్చిన తరువాత దర్శకుడు కార్తీక్ నరేన్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ను పునఃప్రాంభించనున్నాడు.

రీసెంట్ గా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి అంగీకరించాడు ధనుష్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమైతే కెరీర్ పరంగా ధనుష్ చాలా బిజీగా ఉన్నాడు.